Punganur : పుంగనూరు మున్సిపాలిటీలో 62.23 శాతం పోలింగ్ నమోదు
- మిగిలిన నాలుగు వార్డుల్లో ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు
- నవంబర్ 3న ఓట్ల లెక్కింపు.. అభ్యర్థుల భవితవ్యంపై ఉత్కంఠ
పుంగనూరు, నవంబర్ 1 (ఎన్ టుడే న్యూస్):
అన్నమయ్య జిల్లా పుంగనూరు మున్సిపాలిటీ పరిధిలో మిగిలిన నాలుగు వార్డులకు ఆదివారం నిర్వహించిన ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. పోలింగ్ ముగిసే సమయానికి మొత్తం 62.23 శాతం ఓటింగ్ నమోదైంది.
5,073 మంది ఓటర్లు.. 3,157 మంది ఓటు వినియోగం
నాలుగు వార్డుల్లో కలిపి మొత్తం 5,073 మంది ఓటర్లు ఉండగా, వారిలో 3,157 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరో 1,916 మంది ఓటర్లు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.
32 వార్డులు ఏకగ్రీవం
పుంగనూరు మున్సిపాలిటీలో మొత్తం 36 వార్డులు ఉండగా, ఇప్పటికే 32 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 9, 11, 28, 35వ వార్డులకు మాత్రమే ఆదివారం పోలింగ్ నిర్వహించారు.
నవంబర్ 3న ఓట్ల లెక్కింపు
నాలుగు వార్డుల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఆయా వార్డుల్లో పోటీ చేసిన అభ్యర్థుల భవితవ్యంపై ఉత్కంఠ నెలకొంది. నవంబర్ 3వ తేదీన నిర్వహించనున్న ఓట్ల లెక్కింపుతో విజేతలు ఎవరనేది తేలనుంది.