గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదును వేగవంతం చేయాలి మధిరలో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం.. పార్టీ శ్రేణులకు నామ నాగేశ్వరరావు
దిశానిర్దేశం పార్టీ కష్టకాలంలో పనిచేసే కార్యకర్తలకు అండగా ఉంటాం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యం మధిర, నవంబర్ 1: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని బీఆర్ఎస్ మాజీ లోక్సభ పక్ష నేత, ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదును నవంబర్ 6వ తేదీలోపు పూర్తిచేసేలా నాయకులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. పార్టీ బలోపేతానికి క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేస్తూ, ఎన్నికల కార్యాచరణను విజయవంతం చేయాలని దిశానిర్దేశం చేశారు. ఖమ్మం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లింగాల కమల్ రాజు అధ్యక్షతన ఆదివారం మధిరలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మధిర రూరల్, మధిర మున్సిపాలిటీ, ఎర్రుపాలెం మండలాల ముఖ్య నాయకులు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్చార్జిలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన నామ నాగేశ్వరరావు పార్టీ భవిష్యత్ కార్యాచరణపై నాయకులకు పలు సూచనలు చేశారు. పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చే ప్రతి పిలుపును నాయకులు, కార్యకర్తలు బాధ్యతగా తీసుకుని విజయవంతం చేయాలని అన్నారు. గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, అర్హులైన పట్టభద్రులను గుర్తించి ఓటర్లుగా నమోదు చేయించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని నామ సూచించారు. గ్రామగ్రామాన పార్టీని బలోపేతం చేయడంతోపాటు ఓటర్లను చైతన్యపరిచి, ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతు కూడగట్టాలని కోరారు. గత ఎన్నికల్లో జరిగిన పొరపాట్లను విశ్లేషించుకుని, వాటి నుంచి పాఠాలు నేర్చుకుంటూ రాబోయే ఎన్నికల్లో పకడ్బందీ వ్యూహంతో ముందుకు సాగాలని స్పష్టం చేశారు. పార్టీ కష్టకాలంలోనూ అంకితభావంతో పనిచేస్తున్న నాయకులు, కార్యకర్తలకు బీఆర్ఎస్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని నామ భరోసా ఇచ్చారు. పదవులు, పరిస్థితులతో సంబంధం లేకుండా పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తను గుర్తించి ప్రోత్సహించడం పార్టీ బాధ్యత అని పేర్కొన్నారు. సీనియర్ నాయకులు, యువత, కార్యకర్తలు పరస్పర సమన్వయంతో ఒక బృందంగా పనిచేస్తూ పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఇటీవల కర్ణాటకలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ నాలుగు స్థానాల్లోనూ ఓటమి పాలైందని నామ పేర్కొన్నారు. తెలంగాణలోనూ కాంగ్రెస్ పరిస్థితి బలహీనంగా ఉందని వ్యాఖ్యానిస్తూ, రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకునేందుకు నాయకులు సమష్టిగా కృషి చేయాలని కోరారు. గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో విజయం చేజారినప్పటికీ ఏనుగుల రాకేష్ రెడ్డి నిరంతరం ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలపై స్పందిస్తున్నారని తెలిపారు. ఆయనకు పార్టీ శ్రేణులు అండగా నిలిచి, రాబోయే ఎన్నికల్లో విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై నామ విమర్శలు చేశారు. ప్రభుత్వ పాలనలో కమిషన్ల వ్యవహారం పెరిగిందని, ప్రజల ఆస్తులు, సొమ్మును దోచుకుంటున్నారని ఆరోపించారు. జిల్లాలో మంత్రుల ద్వారా జరిగిన అభివృద్ధి కనిపించడం లేదని విమర్శించారు. బడుగు, బలహీన వర్గాల ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను గుర్తించి, వారికి అండగా నిలవడం ద్వారా పార్టీపై విశ్వాసాన్ని మరింత పెంచుకోవాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పదేళ్ల పాలనలో పల్లెలు, పట్టణాలు గణనీయంగా అభివృద్ధి చెందాయని నామ పేర్కొన్నారు. ఆ సమయంలో విద్యుత్, తాగునీరు, సాగునీటి రంగాల్లో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారని వివరించారు. ప్రస్తుత ప్రభుత్వ పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పార్టీ శ్రేణులు నిరంతరం స్పందిస్తూ ప్రజల పక్షాన నిలవాలని అన్నారు. పార్టీ అధిష్ఠానం చేపట్టే కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు మధిర నియోజకవర్గంలో బీఆర్ఎస్ను మరింత బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ పట్టుదలతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మధిర రూరల్, మధిర మున్సిపాలిటీ, ఎర్రుపాలెం మండలాల కోఆర్డినేటర్లు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు బాధ్యులు, బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.