పెనుగొలనులో పలుచోట్ల గురజాడ అప్పారావు జయంతి వేడుకలు
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలో సోమవారం పలుచోట్ల అభ్యుదయ కవి, సామాజిక సంస్కర్త గురజాడ అప్పారావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కోట మార్కండేయ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, 99వ అంగన్వాడీ కేంద్రం, గ్రామ గ్రంథాలయంలో గురజాడ అప్పారావు చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
కోట మార్కండేయ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో
పెనుగొలను కోట మార్కండేయ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు డి. దుర్గాప్రసాద్ మాట్లాడుతూ గురజాడ అప్పారావు తన రచనల ద్వారా సమాజంలో మార్పు కోసం కృషి చేసిన గొప్ప రచయితగా కొనియాడారు. ‘కన్యాశుల్కం’ నాటకంతో పాటు ‘దేశమును ప్రేమించుమన్నా’, ‘పుత్తడి బొమ్మ’ వంటి రచనలు, గేయాల ద్వారా సమాజంలోని మూఢనమ్మకాలు, అసమానతలపై చైతన్యం కల్పించారని తెలిపారు. విద్యార్థులు గురజాడ సాహిత్యాన్ని చదివి ఆయన ఆశయాలను అర్థం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
99వ అంగన్వాడీ కేంద్రంలో
పెనుగొలను 99వ అంగన్వాడీ కేంద్రంలో కూడా గురజాడ అప్పారావు జయంతి వేడుకలు నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ ఉపాధ్యాయురాలు కే. లింగమ్మ మాట్లాడుతూ స్త్రీలకు పురుషులతో సమాన హక్కులు ఉండాలనే భావనను గురజాడ అప్పారావు తన రచనల ద్వారా శతాబ్దం క్రితమే బలంగా వినిపించారని తెలిపారు. మహిళల హక్కులు, సామాజిక సమానత్వం, స్త్రీ విముక్తి వంటి అంశాలపై ప్రజల్లో చైతన్యం కల్పించిన గొప్ప సామాజిక సంస్కర్తగా గురజాడను గుర్తు చేసుకున్నారు. అనంతరం మిఠాయిలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో గ్రామస్తులు, మహిళలు, అంగన్వాడీ చిన్నారులు పాల్గొన్నారు.
పెనుగొలను గ్రంథాలయంలో
పెనుగొలను గ్రామ గ్రంథాలయంలో గురజాడ అప్పారావు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గ్రంథాలయ అధికారి తెనాలి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గురజాడ రచించిన ‘దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయ్’ అనే భావం తెలుగువారి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. దేశభక్తిని కేవలం భూమితో కాకుండా ప్రజలతో ముడిపెట్టి వివరించిన గురజాడ ఆలోచనలు నేటికీ సమాజానికి స్ఫూర్తినిస్తున్నాయని తెలిపారు. కార్యక్రమంలో శిరిడి సాయిబాబా సేవా కమిటీ అధ్యక్షులు ఊటుకూరు నారాయణరావు, గింజుపల్లి శంకరయ్య, ఆళ్ల మురళి, గ్రామస్తులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.