Warangal: ఎమ్మెల్సీ ఓటర్ నమోదు గడువు మరో 15 రోజులు పొడిగించాలి
గెజిటెడ్ అధికారి సంతకం నిబంధనను తక్షణమే ఎత్తివేయాలి: సూడి అనిల్ రెడ్డి
వరంగల్, నవంబర్ 1 (ఎన్ టుడే న్యూస్):
తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు గడువును మరో 15 రోజులు పొడిగించాలని, ఓటరు నమోదుకు అడ్డంకిగా మారిన గెజిటెడ్ అధికారి సంతకం నిబంధనను తక్షణమే ఎత్తివేయాలని తెలంగాణ రాష్ట్రీయ లోక్‌దళ్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సూడి అనిల్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు.
ఆదివారం వరంగల్ జిల్లా పరిధిలోని రెడ్యాల గ్రామంలో తన స్వగృహంలో నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఓటరు నమోదు ప్రక్రియ నెమ్మదిగా సాగుతుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు.
గ్రామీణ గ్రాడ్యుయేట్లకు ఇబ్బందులు
గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న వేలాది మంది పట్టభద్రులు, నిరుద్యోగులకు గెజిటెడ్ అధికారి సంతకం తీసుకురావడం భారంగా మారిందని అనిల్ రెడ్డి పేర్కొన్నారు. చాలా మంది గ్రాడ్యుయేట్లకు ఓటరు నమోదు ప్రక్రియపై సరైన అవగాహన కూడా లేదని తెలిపారు. ఈ పరిస్థితుల్లో నమోదు గడువు ముగిస్తే అర్హులైన అనేక మంది యువ ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
నమోదు ప్రక్రియను సులభతరం చేయాలి
గెజిటెడ్ అధికారి సంతకం నిబంధన కారణంగా గ్రామీణ ప్రాంతాల పట్టభద్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రభుత్వం మానవతా దృక్పథంతో స్పందించి, నమోదు ప్రక్రియను సులభతరం చేయాలని కోరారు. ఎలాంటి అనవసర అడ్డంకులు లేకుండా అర్హులైన ప్రతి పట్టభద్రుడికి ఓటు నమోదు చేసుకునే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
ఓటరు నమోదు గడువును మరో 15 రోజులు పొడిగించి, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని సూడి అనిల్ రెడ్డి డిమాండ్ చేశారు.
సమావేశంలో పాల్గొన్న నాయకులు
ఈ సమావేశంలో వరంగల్ జిల్లా యూత్ అధ్యక్షుడు ఇంగ్లే నాగరాజు, మహబూబాబాద్ జిల్లా ఆర్ఎల్డీ యూత్ అధ్యక్షుడు షేక్ ఇమ్రాన్ అలీ, ఉపాధ్యక్షుడు అలకుంట్ల ప్రవీణ్, జిల్లా బాధ్యులు సూడి హరీష్ రెడ్డి, పత్తిపాక ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.