Hyderabad: కరెంటు చార్జీలకు పై పునరాలోచించండి
కరెంట్ చార్జీల పెంపుపై ప్రభుత్వం పునరాలోచించాలి: జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి శంతన్ రామరాజు
హైదరాబాద్, నవంబర్ 1 (ఎన్ టుడే న్యూస్):
తెలంగాణ ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలపై జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి శంతన్ రామరాజు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న సామాన్య ప్రజలపై విద్యుత్ చార్జీల భారం మోపడం సమంజసం కాదని, పెంపు నిర్ణయంపై ప్రభుత్వం పునరాలోచించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
కరోనా నుంచి కోలుకుంటున్న ప్రజలపై అదనపు భారం
కరోనా కాలం నుంచి అనేక కుటుంబాలు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయాయని శంతన్ రామరాజు పేర్కొన్నారు. ఇప్పుడిప్పుడే ఆర్థికంగా కోలుకుంటున్న సమయంలో ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో విద్యుత్ చార్జీల పెంపు సామాన్య ప్రజలు, రైతులు, చిన్న, మధ్యతరహా పరిశ్రమలపై తీవ్ర ప్రభావం చూపుతుందని అన్నారు.
యూనిట్‌కు 30 నుంచి 50 పైసల పెంపు
నవంబర్ నుంచి ఒక్కో యూనిట్‌కు 30 నుంచి 50 పైసల వరకు అదనంగా వసూలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ట్రూ-అప్ చార్జీల రూపంలో డిస్కంలు మొత్తం రూ.7,635 కోట్లు వసూలు చేయనున్నాయని తెలిపారు. TGSPDCL పరిధిలో 2029 మార్చి వరకు, TGNPDCL పరిధిలో 2028 డిసెంబర్ వరకు ఈ అదనపు చార్జీల భారం కొనసాగుతుందని పేర్కొన్నారు.
ఈ అదనపు భారం ప్రజల రోజువారీ జీవన వ్యయంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
నిత్యావసర ధరల పెరుగుదలతో సతమతం
ఇప్పటికే కరువు పరిస్థితులకు తోడు మిల్లర్ల దోపిడీ కారణంగా బియ్యం ధరలు కిలో రూ.100కు చేరువవుతున్నాయని శంతన్ రామరాజు ఆరోపించారు. ఇతర నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగి సామాన్యుల ఆర్థిక పరిస్థితిని మరింత దిగజారుస్తున్నాయని అన్నారు. ఈ పరిస్థితులు కొనసాగితే పేద, మధ్యతరగతి కుటుంబాల జీవనం మరింత దుర్భరంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యుత్ చార్జీల పెంపుపై పునరాలోచించాలి
ప్రజా పాలనకు మద్దతు తెలిపిన ప్రజలపైనే అదనపు విద్యుత్ చార్జీల భారం మోపడం సరికాదని శంతన్ రామరాజు అన్నారు. సామాన్య ప్రజలు, రైతులు, చిన్న పరిశ్రమల ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పెంచిన విద్యుత్ చార్జీల అమలుపై ప్రభుత్వం పునరాలోచించాలని విజ్ఞప్తి చేశారు.