Mahabubabad: చదువుకు చేయూత.. ప్రతిభకు ప్రోత్సాహం
67 మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు.. ప్రతిభావంతుల భవిష్యత్తుకు ఆర్థిక భరోసా
మహబూబాబాద్, నవంబర్ 1 (ఎన్ టుడే న్యూస్):
పేదరికం ప్రతిభకు అడ్డుకాకూడదనే లక్ష్యంతో శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ విద్యార్థులకు అండగా నిలిచింది. సంస్థ సామాజిక బాధ్యతలో భాగంగా మహబూబాబాద్ పట్టణానికి చెందిన 67 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.4,000 నుంచి రూ.4,500 వరకు స్కాలర్‌షిప్‌లు అందించి ప్రోత్సహించింది.
67 మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు
హౌసింగ్ బోర్డు రెడ్డి కమ్యూనిటీ హాల్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి శ్రీరామ్ ఫైనాన్స్ మహబూబాబాద్ బ్రాంచ్ మేనేజర్ పిరమళ్ల శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా జేసీబీ అధ్యక్షుడు గార్లపాటి మహిపాల్ రెడ్డి, మారుతి సుజుకి మేనేజర్ శ్రీనాథ్ రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా 67 మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లతో పాటు ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. సీనియర్ జర్నలిస్ట్ బాల్నే సుమన్ చేతుల మీదుగా విద్యార్థిని చందనకు స్కాలర్‌షిప్ సర్టిఫికెట్ అందించారు. విద్యార్థులను అభినందిస్తూ ఇలాంటి ప్రోత్సాహక కార్యక్రమాలు వారి విద్యాభివృద్ధికి ఎంతగానో దోహదపడతాయని అతిథులు పేర్కొన్నారు.
విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించడమే లక్ష్యం
ఈ సందర్భంగా బ్రాంచ్ మేనేజర్ పిరమళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ 8వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడం ఆనందంగా ఉందన్నారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి, వారి చదువుకు ఆర్థికంగా తోడ్పడటమే తమ సంస్థ ఉద్దేశమని తెలిపారు. వచ్చే ఏడాది మరింత మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందించేందుకు కృషి చేస్తామని వెల్లడించారు.
కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు
ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హాల్ అధ్యక్షుడు మోహన్ రెడ్డి, బిజినెస్ మేనేజర్ మెరుగు భీమ్ రాజ్, సంస్థ ప్రతినిధులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.