Hanmakonda: భీమారానికి మహిళా పోలీస్ స్టేషన్ తరలింపు
మహిళలకు పోలీస్ సేవలు మరింత చేరువ.. కొత్త భవనంలో ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్ ఏర్పాటు
హనుమకొండ, నవంబర్ 1 (ఎన్ టుడే న్యూస్):
హనుమకొండలోని సుబేదారి పోలీస్ స్టేషన్ పై అంతస్తులో కొనసాగుతున్న మహిళా పోలీస్ స్టేషన్‌ను భీమారంలోని కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ సమీపంలోని పోలీస్ క్వార్టర్స్ భవనానికి తరలించారు. మహిళలు, ఫిర్యాదుదారులకు పోలీస్ సేవలను మరింత సులభంగా అందించాలనే ఉద్దేశంతో పోలీస్ కమిషనర్ శ్వేత, ఐపీఎస్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
స్థలాభావంతో కొత్త భవనానికి మార్పు
సుబేదారి పోలీస్ స్టేషన్‌లో స్థలాభావం కారణంగా మహిళా పోలీస్ స్టేషన్ నిర్వహణకు ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో విశాలమైన ప్రాంగణానికి మార్చారు. కొత్త భవనంలో మహిళలు, ఫిర్యాదుదారులు తమ సమస్యలను స్వేచ్ఛగా వివరించేందుకు అనుకూలమైన వాతావరణం కల్పించనున్నారు.
ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్ ఏర్పాటు
కొత్త భవనంలో మహిళా పోలీస్ స్టేషన్‌తో పాటు సర్వోదయ ఎన్జీవో ఆధ్వర్యంలో ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేశారు. కుటుంబ సమస్యలు, దాంపత్య వివాదాలు తదితర అంశాలపై బాధితులకు కౌన్సెలింగ్ అందించేందుకు ఈ కేంద్రం ఉపయోగపడనుంది.
మహిళలు తమ సమస్యల పరిష్కారం కోసం పోలీస్ స్టేషన్‌కు సులభంగా చేరుకునేలా, వారికి మెరుగైన సేవలు అందేలా ఈ మార్పు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.