ఏపీ టెట్–2026కు ఏలూరు జిల్లాలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు
ఏపీ టెట్–2026కు ఏలూరు జిల్లాలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు
ఆగస్టు 5 నుంచి 21 వరకు పరీక్షలు.. 4,625 మంది అభ్యర్థులు హాజరు
ఏలూరు, ఆగస్టు 4: ఏపీ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్)–2026 పరీక్షలను ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా సజావుగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్‌లోని గోదావరి సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పరీక్షల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు.
జిల్లాలో ఆగస్టు 5 నుంచి 21 వరకు టెట్ పరీక్షలు జరగనున్నాయని, ఇందుకోసం రెండు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఏలూరు–వట్లూరులోని సిద్ధార్థ క్వెస్ట్ సీబీఎస్‌ఈ పాఠశాలలో ఆగస్టు 5 నుంచి 21 వరకు, శ్రీ సీఆర్ రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో ఆగస్టు 9 నుంచి 16 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
ప్రతిరోజూ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తొలి విడత, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో విడత పరీక్షలు జరుగుతాయని తెలిపారు. జిల్లాలో మొత్తం 4,625 మంది అభ్యర్థులు టెట్ పరీక్షలకు హాజరుకానున్నట్లు చెప్పారు.
పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని, సమీపంలోని జిరాక్స్, ఇంటర్నెట్ కేంద్రాలను పరీక్షల సమయంలో మూసివేయాలని ఆదేశించారు. విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలని విద్యుత్ శాఖకు సూచించారు. వైద్య సిబ్బందిని పరీక్షా కేంద్రాల వద్ద అందుబాటులో ఉంచాలని, దివ్యాంగ అభ్యర్థులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించి మూడు చక్రాల వాహనం, సహాయకుడిని సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు.
అలాగే తాగునీరు, పారిశుద్ధ్యం, ఇతర మౌలిక వసతులను సమకూర్చాలని సంబంధిత శాఖలకు సూచించారు. పరీక్షల సమయాల్లో అభ్యర్థులకు ఇబ్బందులు కలగకుండా ఆయా మార్గాల్లో ఆర్టీసీ బస్సులు నిరంతరాయంగా నడిచేలా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ అధికారులకు ఆదేశించారు.