పుట్టపర్తిలో బెల్ట్ షాపుపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్
ఆంధ్రప్రదేశ్
/
శ్రీ సత్యసాయి
పుట్టపర్తి: శ్రీసత్యసాయి జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ ఐపీఎస్ ఆదేశాల మేరకు పుట్టపర్తి పట్టణ పోలీసులు అక్రమంగా మద్యం విక్రయిస్తున్న బెల్ట్ షాపుపై దాడి నిర్వహించారు. పట్టణంలోని గణేష్ సర్కిల్ ప్రాంతంలో ఈరోజు ఉదయం 8 గంటల సమయంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు.
ఈ దాడిలో అనధికారికంగా మద్యం విక్రయిస్తున్న ఒబులప్ప అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 31 క్వార్టర్ మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పుట్టపర్తి పట్టణ సీఐ యువరాజు వెల్లడించారు.
ఈ సందర్భంగా సీఐ యువరాజు మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన పుట్టపర్తి పట్టణంలో అక్రమ మద్యం విక్రయాలు, అసాంఘిక కార్యకలాపాలను ఉపేక్షించబోమని తెలిపారు. అక్రమంగా మద్యం విక్రయించే వారిపై నిరంతరం నిఘా కొనసాగుతుందని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అక్రమ మద్యం విక్రయాలకు సంబంధించిన సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని ప్రజలకు సూచించారు.