www.ntodaynews.com
మసీదుల వద్ద సమగ్ర సదుపాయాలు కల్పించాలి
తెలంగాణ
రంజాన్ సందర్భంగా మసీదుల వద్ద సమగ్ర సదుపాయాలు కల్పించాలి: అదనపు కలెక్టర్
NTODAY NEWS: యాదాద్రి భువనగిరి
పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమవుతున్న నేపథ్యంలో జిల్లాలోని అన్ని మసీదుల వద్ద అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్ రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం మినీ మీటింగ్ హాలులో నిర్వహించిన శాంతి సంఘ సమావేశంలో ఆయన ఈ సూచనలు చేశారు.
రంజాన్ ఏర్పాట్లపై కేటాయించిన విధులను శాఖల మధ్య సమన్వయంతో నిర్వహించాలని తెలిపారు. నమాజ్ సమయాల్లో విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని, కరెంట్ సరఫరా నిరంతరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మసీదుల వద్ద పారిశుద్ధ్య పనులు చేపట్టి, తాగునీటి సదుపాయం కల్పించడంతో పాటు వీధి దీపాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మున్సిపాలిటీ వార్డుల్లో తాగునీరు సమయానికి అందేలా పర్యవేక్షించాలని చెప్పారు.
జిల్లాలో రంజాన్ మాసం సోదరభావంతో, ప్రశాంత వాతావరణంలో జరిగేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. మతసామరస్యానికి ప్రతీకగా జిల్లాను నిలపాలని పిలుపునిచ్చారు.
అడిషనల్ ఎస్పీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ రంజాన్ మాసం సందర్భంగా మసీదుల వద్ద పటిష్ట బందోబస్తు, భద్రతా ఏర్పాట్లు చేపడతామని తెలిపారు. అందరి సహకారంతో సామరస్య వాతావరణంలో వేడుకలు నిర్వహించుకునేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జయమ్మ, భువనగిరి ఆర్డీఓ కృష్ణారెడ్డి, పోలీసు అధికారులు, మత పెద్దలు మరియు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
#Ramzan2026 #YadadriBhuvanagiri #PeaceCommittee #DistrictAdministration #PublicFacilities
Follow us on
Website
Facebook
Instagram
YouTube