ముచ్చనపల్లిలో ఘనంగా పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ
ముచ్చనపల్లిలో ఘనంగా పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ
రైతు సంక్షేమానికి మరో అడుగు
ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం రెడ్డిగూడెం మండలం ముచ్చనపల్లి గ్రామంలో రెడ్డిగూడెం ఎమ్మార్వో ఆధ్వర్యంలో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ చొరవతో జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు, సామాజిక సేవకుడు ముప్పిడి నాగేశ్వరరెడ్డి రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు.
కార్యక్రమానికి జానపాటి వేణుగోపాల్ రెడ్డి, బెల్లంకొండ రాజా, నాదెళ్ల చెన్నకేశవరావు, కిలారు రాంబాబు, గోదా శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా హాజరై రైతులకు శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక నాయకులు, అధికారులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముప్పిడి నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. రైతుల అభ్యున్నతి, వ్యవసాయ రంగ అభివృద్ధి, రైతు కుటుంబాల ఆర్థిక స్థితిగతుల మెరుగుదల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు.
సాగునీటి సౌకర్యాల కల్పన, వ్యవసాయ మౌలిక వసతుల అభివృద్ధి, సబ్సిడీపై విత్తనాలు, ఎరువుల పంపిణీ, భూ హక్కుల పరిరక్షణ వంటి కార్యక్రమాలను ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తోందన్నారు. పట్టాదారు పాస్ పుస్తకం రైతు భూమిపై హక్కుకు గుర్తింపని, దీని ద్వారా రైతులు బ్యాంకు రుణాలు పొందడంతో పాటు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను సులభంగా పొందవచ్చని వివరించారు.
ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ నియోజకవర్గ రైతుల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని పరిష్కారానికి ప్రత్యేక చొరవ చూపుతున్నారని, రైతు సంక్షేమ కార్యక్రమాలను గ్రామస్థాయికి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. రైతు పక్షపాత ప్రభుత్వంగా కూటమి ప్రభుత్వం నిలిచిందని, రైతు బాగుంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు.
పట్టాదారు పాస్ పుస్తకాలు అందుకున్న రైతులు ఆనందం వ్యక్తం చేస్తూ, రైతుల హక్కులను పరిరక్షించే చర్యలు చేపడుతున్న ప్రభుత్వాన్ని అభినందించారు. ముచ్చనపల్లి గ్రామంలో జరిగిన ఈ కార్యక్రమం రైతుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ప్రభుత్వం, ఎమ్మెల్యే, స్థానిక నాయకుల కృషికి గ్రామస్థులు ప్రశంసలు కురిపించారు.