మురసు తుఫాను తీవ్రత.. ఎన్టీఆర్ జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు తీరందాటే సమయంలో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో గాలులు
మురసు తుఫాను తీవ్రత.. ఎన్టీఆర్ జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు తీరందాటే సమయంలో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో గాలులు దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు విజయవాడ: మురసు తుఫాను తీవ్రత పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుఫానుగా బలపడిన మురసు తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. నవంబర్ 2వ తేదీ తెల్లవారుజామున విడుదల చేసిన సమాచారం ప్రకారం, తుఫాను గంటకు 20 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. చెన్నైకి 260 కిలోమీటర్లు, నెల్లూరుకు 290 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 320 కిలోమీటర్లు, కావలికి 310 కిలోమీటర్లు, ఒంగోలుకు 330 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 470 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఒంగోలు సమీపంలో తీరం దాటే అవకాశం మురసు తుఫాను సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం తెల్లవారుజామున మధ్య నెల్లూరు–నరసాపురం మధ్య ఒంగోలు సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. తీరం దాటే సమయంలో గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో, గరిష్ఠంగా 120 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని హెచ్చరించారు. పలు జిల్లాలకు భారీ వర్ష సూచన తుఫాను ప్రభావంతో సోమవారం కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒకటి రెండు ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు పడవచ్చని అధికారులు తెలిపారు. ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, పల్నాడు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. అల్లూరి, పోలవరం, కాకినాడ, కోనసీమ, నంద్యాల, వైఎస్సార్ కడప, అన్నమయ్య జిల్లాల్లోనూ కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని వెల్లడించారు. ఎన్టీఆర్ జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు తుఫాను ప్రభావం, ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ నవంబర్ 2వ తేదీ సోమవారం జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటించారు. అన్ని విద్యాసంస్థలు తప్పనిసరిగా మూసివేయాలని, ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తుఫాను ప్రభావం తగ్గేవరకు విద్యార్థులు, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సహాయక చర్యలకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు ముందస్తుగా ఆరు ఎన్డీఆర్ఎఫ్, ఏడు ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేశారు. ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, అధికారుల సూచనలు పాటించాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ, ఆర్టీజీఎస్ సీఈవో ప్రఖర్ జైన్ సూచించారు. భారీ వర్షాలు, ఈదురుగాలుల నేపథ్యంలో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.