జి.కొండూరులో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు రోడ్‌షో
కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా విస్తృత ప్రచారం
గ్రామాల అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలి
ఎన్టీఆర్ జిల్లా, జి.కొండూరు, నవంబర్ 2:
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ మైలవరం ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వసంత కృష్ణప్రసాదు జి.కొండూరు గ్రామంలో సోమవారం రోడ్‌షో నిర్వహించారు. జెడ్పీటీసీ అభ్యర్థిని డాక్టర్ వేములకొండ రేవతి చంద్రిక, జి.కొండూరు-1 ఎంపీటీసీ అభ్యర్థి పజ్జూరు నాగరాజు, జి.కొండూరు-2 ఎంపీటీసీ అభ్యర్థి ఉయ్యూరు అనురాధిక విజయాన్ని కాంక్షిస్తూ నిర్వహించిన ప్రచారానికి ప్రజల నుంచి స్పందన లభించింది.
ప్రచార రథంపై నుంచి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు, జనసేన పార్టీ అధికార ప్రతినిధి అక్కల గాంధీతో కలిసి కూటమి అభ్యర్థులకు మద్దతుగా ఓటర్లను అభ్యర్థించారు. రాబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి కూటమి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కూటమి అభ్యర్థుల విజయంతో గ్రామాల అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
హారతులతో ఘనస్వాగతం
రోడ్‌షో సందర్భంగా గ్రామస్తులు, మహిళలు ఎమ్మెల్యేకు ఘనస్వాగతం పలికారు. మహిళలు హారతులు పట్టి స్వాగతించగా, పలువురు పూలు చల్లి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ప్రచార రథంపై నుంచి ప్రజలను పలకరిస్తూ కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని ఎమ్మెల్యే కోరారు.
అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యం
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాబోయే రెండున్నరేళ్లలో రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగవంతం చేస్తామని వసంత కృష్ణప్రసాదు తెలిపారు. స్థానిక సంస్థల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించి, ప్రజాప్రతినిధులంతా సమన్వయంతో పనిచేస్తే గ్రామాల్లో అభివృద్ధి పనులను సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లవచ్చని పేర్కొన్నారు. గ్రామాల సమగ్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కూటమి అభ్యర్థులకు ప్రజలు మద్దతు తెలిపి సైకిల్ గుర్తుపై ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, కూటమి శ్రేణులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.