Narketpally: ఇద్దరు పిల్లలతో వివాహిత అదృశ్యం
NTODAY NEWS ; నార్కట్‌పల్లి
నార్కట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని నార్కట్‌పల్లి గ్రామంలో ఓ వివాహిత మహిళ తన ఇద్దరు పిల్లలతో అదృశ్యమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చిన్నతుమ్మలగూడెం గ్రామానికి చెందిన బాకీ నరసింహ తన కుమార్తె నోముల అరుణ జ్యోతిని సుమారు ఎనిమిదేళ్ల క్రితం రామన్నపేట మండలం నీర్నేముల గ్రామానికి చెందిన నోముల వంశీకి ఇచ్చి వివాహం జరిపించాడు. వీరికి కృతికేష్, విద్యశ్రీ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండటంతో రెండేళ్ల క్రితం నార్కట్‌పల్లికి వచ్చి నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో నవంబర్ 1వ తేదీ రాత్రి సుమారు 7 గంటల సమయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో అరుణ జ్యోతి తన ఇద్దరు పిల్లలను తీసుకొని ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు భర్త నోముల వంశీ ఫోన్ ద్వారా మామకు సమాచారం అందించాడు. దీంతో కుటుంబ సభ్యులు నార్కట్‌పల్లికి చేరుకొని చుట్టుపక్కల ప్రాంతాలు, బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో బాకీ నరసింహ నార్కట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, ఎస్సై సీహెచ్. వెంకటేశ్వర్లు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అదృశ్యమైన అరుణ జ్యోతి, ఆమె పిల్లలు కృతికేష్, విద్యశ్రీ ఆచూకీ తెలిసిన వారు సమీప పోలీస్ స్టేషన్‌లో లేదా నార్కట్‌పల్లి పోలీసులకు సమాచారం అందించాలని పోలీసులు కోరారు.