Mahabubabad : ఏజెన్సీ గ్రామాల్లో ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన
తక్కువ నీటితో సాగయ్యే పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలి: ఏడీఏ శ్రీనివాసరావు
బయ్యారం, నవంబర్ 2 (ఎన్ టుడే న్యూస్):
ఎల్‌నినో వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో భవిష్యత్తులో నీటి లభ్యత తగ్గే అవకాశాలు ఉన్నందున రైతులు తక్కువ నీటితో సాగు చేసుకునే ప్రత్యామ్నాయ పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలని మహబూబాబాద్ వ్యవసాయ సహాయ సంచాలకులు (ఏడీఏ) ఎ. శ్రీనివాసరావు సూచించారు.
ఏజెన్సీ గ్రామాల్లో పర్యటన
సోమవారం బయ్యారం మండల వ్యవసాయ అధికారి కె. రాజుతో కలిసి మండలంలోని మారుమూల ఏజెన్సీ గ్రామాలైన నారాయణపురం, కంబాలపల్లి, అల్లిగూడెంలలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా రైతులతో సమావేశమై ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల సాగుపై అవగాహన కల్పించారు.
కంబాలపల్లిలో నిర్వహించిన రైతుల సమావేశంలో 'ఖేత్ బచావో అభియాన్' కార్యక్రమం గురించి వివరించారు. నేల ఆరోగ్యం, భూసార పరిరక్షణ ప్రాముఖ్యతను వివరిస్తూ రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి, సుస్థిర వ్యవసాయ పద్ధతులను పాటించాలని సూచించారు.
ప్రత్యామ్నాయ పంటల సాగును పరిశీలన
ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా జొన్న, మినుము, అలసంద, కంది వంటి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేస్తున్న రైతులను ఏడీఏ అభినందించారు.
అనంతరం అల్లిగూడెం గ్రామానికి చెందిన రైతు అవిరె నారాయణ ఆయిల్‌పామ్ తోటలో అంతర పంటలుగా మినుము, అలసంద, వేరుశనగ సాగు చేస్తున్న విధానాన్ని పరిశీలించారు. అలాగే నారాయణపురం గ్రామానికి చెందిన రైతు బానోత్ స్వామి తన ఆరు ఎకరాల భూమిలో జొన్న పంట సాగు చేస్తున్న తీరును పరిశీలించి అభినందించారు.
పంటల వైవిధ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి
రైతులు వాతావరణ మార్పులను ముందుగానే అంచనా వేసుకొని పంటల వైవిధ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఏడీఏ శ్రీనివాసరావు సూచించారు. నీటి వినియోగాన్ని తగ్గించే సాగు పద్ధతులను అనుసరించి, భూసారాన్ని కాపాడుకుంటూ సుస్థిర వ్యవసాయం దిశగా ముందుకు సాగాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏఈవోలు ఫయాజ్, నాగరాజు, రైతులు తదితరులు పాల్గొన్నారు.