IDBI బ్యాంకు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన
రెండు రోజుల ఉద్యోగుల సమ్మెకు సంఘీభావం.. నర్సంపేటలో లంచ్ అవర్ నిరసన
వరంగల్, నవంబర్ 2 (ఎన్ టుడే న్యూస్): IDBI బ్యాంకు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, బ్యాంకు ఉద్యోగులు చేపట్టిన రెండు రోజుల సమ్మెకు సంఘీభావంగా సోమవారం వరంగల్ డివిజన్‌లోని పలు బ్రాంచీలలో లంచ్ అవర్ నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. AIIEA పిలుపు మేరకు ICEU నర్సంపేట బ్రాంచ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ప్రభుత్వ రంగ బ్యాంకులను కాపాడుకోవాలి
ఈ సందర్భంగా ICEU నర్సంపేట బ్రాంచ్ కార్యదర్శి జూపాక రత్నప్రణయ్ మాట్లాడుతూ.. ఐక్యత, చైతన్యం, పోరాట స్ఫూర్తి సంఘటిత శక్తికి నిదర్శనమని అన్నారు. బ్యాంకింగ్ రంగ పరిరక్షణ కోసం ఉద్యోగులంతా ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవాలని, కార్మిక ఐక్యతను చాటాలని ఆయన కోరారు. IDBI బ్యాంకు ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యోగుల పోరాటానికి తమ సంఘీభావం కొనసాగుతుందని తెలిపారు.
ఉద్యోగుల సంఘీభావం
ఈ నిరసన కార్యక్రమంలో ICEU నర్సంపేట బ్రాంచ్ అధ్యక్షుడు రమేష్, కార్యదర్శి జూపాక రత్నప్రణయ్, కోశాధికారి మధుసూదన్‌తో పాటు సంఘ సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు.