కల్వల గ్రామంలో వీధికుక్కల దాడులు.. ముగ్గురు చిన్నారులకు గాయాలు
రెండు రోజులుగా వరుస ఘటనలు.. భయాందోళనలో గ్రామస్తులు
కేసముద్రం, నవంబర్ 2 (ఎన్ టుడే న్యూస్):
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కల్వల గ్రామంలో వీధికుక్కల దాడులు కలకలం రేపుతున్నాయి. గత రెండు రోజులుగా గ్రామంలో కుక్కలు చిన్నారులపై దాడులకు పాల్పడుతుండటంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ ఘటనల్లో ముగ్గురు బాలురు గాయపడినట్లు సమాచారం.
ముగ్గురు చిన్నారులకు కుక్కకాటు
ఆదివారం గ్రామానికి చెందిన వేముల ఏసు కుమారుడు శివ (5) కుక్కకాటుకు గురయ్యాడు. సోమవారం నాంపల్లి దామోదర్ కుమారుడు రిషి (10), ఈసంపల్లి నాగార్జున కుమారుడు గౌతమ్ (10) కుక్కల దాడిలో గాయపడ్డారు.
గాయపడిన చిన్నారులను మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రికి తరలించి వ్యాక్సిన్ అందించారు.
భయాందోళనలో గ్రామస్తులు
గ్రామంలోని వీధుల్లో తిరుగుతున్న కుక్కలు చిన్నారులు, వృద్ధులు, పాదచారులపై దాడులకు పాల్పడుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా పిల్లలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్న పరిస్థితి నెలకొంది.
అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలి
వరుసగా కుక్కల దాడులు జరుగుతుండటంతో సంబంధిత అధికారులు వెంటనే స్పందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. గ్రామంలో వీధికుక్కల బెడదను నివారించడంతో పాటు, ప్రజల భద్రతకు అవసరమైన చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.