గ్రామాల అభివృద్ధే కూటమి ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్
సంతకవిటి మండలంలోని నాలుగు గ్రామాల్లో కూటమి అభ్యర్థులతో కలిసి ఎన్నికల ప్రచారం
సంతకవిటి, నవంబర్ 2 (ఎన్ టుడే న్యూస్):
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోపే గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టి ప్రజల ముందుకు వచ్చామని రాజాం నియోజకవర్గ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొండ్రు మురళీమోహన్ అన్నారు. సోమవారం సంతకవిటి మండలంలోని బొద్దూరు, సంతకవిటి, మంతిన, సిరిపురం గ్రామాల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీ కూటమి అభ్యర్థులతో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ప్రజల నుంచి ఘన స్వాగతం
ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యేకు ఆయా గ్రామాల్లో ప్రజలు ఘన స్వాగతం పలికారు. పూల వర్షం కురిపించగా, మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. కూటమి అభ్యర్థుల తరఫున నాయకులు ప్రజలను కలిసి ఓట్లు అభ్యర్థించారు.
గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యత
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ మాట్లాడుతూ.. గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో అభివృద్ధికి నోచుకోని గ్రామాల్లో ప్రస్తుత కూటమి ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపట్టిందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ఇళ్లను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
నియోజకవర్గంలో ప్రతి ఇంటికీ ఉచిత కుళాయి కనెక్షన్లు కల్పించేందుకు రూ.100 కోట్లు వెచ్చించినట్లు తెలిపారు. అర్హత కలిగిన ప్రతి రైతుకు అన్నదాత సుఖీభవ పథకం మంజూరు చేస్తున్నామని వెల్లడించారు.
కూటమి అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి
స్థానిక ఎన్నికల్లో ప్రజలు అభ్యర్థులకు వేసే ప్రతి ఓటు గ్రామాల అభివృద్ధికి దోహదపడుతుందని ఎమ్మెల్యే అన్నారు. గ్రామాల అభ్యున్నతి కోసం ప్రతి ఒక్కరూ కూటమి అభ్యర్థులకు మద్దతు తెలిపి గెలిపించాలని కోరారు.