www.ntodaynews.com
ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మె
తెలంగాణ
నాలుగు కార్మిక కోడ్లకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మె
సమ్మెను విజయవంతం చేయాలని ఏఐటీయూసీ పిలుపు
NTODAY NEWS: పుంగనూరు ప్రతినిధి రాఘవేంద్ర రాజు
బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేట్ అజెండాను మరింత నిర్దాక్షిణ్యంగా అమలు చేస్తోందని, 2025 నవంబర్ 21 నుంచి నాలుగు కార్మిక కోడ్లను అమలులోకి తీసుకురావాలన్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఫిబ్రవరి 12న కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె చేపట్టనున్నట్లు ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ తెలిపారు.
శుక్రవారం పుంగనూరు పట్టణంలో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సమ్మె కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా సాంబశివ మాట్లాడుతూ, కార్మికులు పోరాడి అనేక త్యాగాలతో సాధించుకున్న హక్కులను రద్దు చేయాలనే ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం నాలుగు కార్మిక కోడ్లను తీసుకొస్తోందని ఆరోపించారు. రాజ్యాంగ స్ఫూర్తి, సుప్రీంకోర్టు తీర్పులు, అంతర్జాతీయ కార్మిక సంస్థ మార్గదర్శకాలను పక్కన పెట్టి కార్మికులను బానిసలుగా మార్చే ప్రయత్నం జరుగుతోందన్నారు.
కార్మిక కోడ్లు అమలులోకి వస్తే ఎనిమిది గంటల పనిదినం, కనీస వేతనాలు, సామాజిక భద్రత, సంఘాలు ఏర్పాటు చేసుకునే హక్కు, సంఘాల గుర్తింపు, సమిష్టి చర్చల హక్కు, సమ్మె చేసే హక్కు వంటి మౌలిక హక్కులన్నీ ప్రమాదంలో పడతాయని పేర్కొన్నారు. దేశంలో 90 శాతం మంది అసంఘటిత రంగ కార్మికులే ఉన్నప్పటికీ, జీడీపీలో 45 శాతం వాటా ఉన్న ఈ వర్గానికి కార్మిక కోడ్లలో సరైన ప్రాధాన్యత ఇవ్వలేదని విమర్శించారు.
ఇంతకుముందు 20 మంది కార్మికులు ఉన్న కాంట్రాక్టర్‌కు తప్పనిసరిగా లైసెన్స్ ఉండాల్సి ఉండేదని, ఇప్పుడు ఆ పరిమితిని 50కి పెంచడంతో లైసెన్స్ లేకుండానే కాంట్రాక్టర్లు వ్యవహరించే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇది కార్మికుల ప్రాథమిక హక్కులపై నేరుగా జరుగుతున్న దాడిగా అభివర్ణించారు.
కనీస వేతనం నెలకు రూ.26 వేలుగా నిర్ణయించాలని, కాంట్రాక్ట్ మరియు ఔట్‌సోర్సింగ్ కార్మికులను రెగ్యులరైజ్ చేసి సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, ఆటో డ్రైవర్లు, హమాలీలకు ప్రత్యేక సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ పుంగనూరు నియోజకవర్గ నాయకులు వెంకటరమణ రెడ్డి, ఆర్టీసీ ఔట్‌సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు గజపతి, సీపీఐ పుంగనూరు పట్టణ కార్యదర్శి రాంమూర్తి, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి సభ్యుడు మున్నా, ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ నాయకుడు బీవీ రమణ తదితరులు పాల్గొన్నారు.
#AITUC #WorkersStrike #LabourCodes #NationwideStrike #TradeUnions #WorkersRights #StopLabourCodes #Punganur #AnnamayyaDistrict
Follow us on
Website
Facebook
Instagram
YouTube