చిట్యాల లో నీటి కోసం ఇబ్బందులు.. ప్రైవేట్ ట్యాంకర్లపైనే ఆధారం
NTODAY NEWS : చిట్యాల,
నల్లగొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో తాగునీటి సమస్య రోజురోజుకూ తీవ్రతరం అవుతోంది. పట్టణంలోని పలు వార్డుల్లో నీటి సరఫరా సక్రమంగా లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రెండో వార్డులో తాగునీటి కొరతతో స్థానికులు అల్లాడుతున్నారు. రోజువారీగా నల్లాల ద్వారా నీరు సరఫరా కాకపోవడంతో ప్రజలు నీటి కోసం ప్రత్యామ్నాయ మార్గాలను ఆశ్రయించాల్సి వస్తోంది. కొందరు ప్రైవేట్ ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించుకుంటూ తమ అవసరాలను తీర్చుకుంటున్నారు. దీంతో ప్రజలకు అదనపు ఖర్చుతో పాటు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నీటి సమస్య కారణంగా రోజువారీ అవసరాలు తీర్చుకోవడం కూడా కష్టంగా మారుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత మున్సిపల్ అధికారులు స్పందించి నీటి సరఫరాలో నెలకొన్న సమస్యలను గుర్తించి, తక్షణమే పరిష్కరించాలని నీటి సమస్య ఉన్న ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు. ప్రజలకు నిరంతరాయంగా నీరు అందేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.