రైతు బజార్లలో కిలో సన్నబియ్యం రూ.50కే
రైతు బజార్లలో కిలో సన్నబియ్యం రూ.50కే సామాన్యులకు ఊరట కలిగించేలా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం ఆంధ్రప్రదేశ్‌లో బహిరంగ మార్కెట్‌లో బియ్యం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు ఊరట కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతు బజార్ల ద్వారా నాణ్యమైన సన్నబియ్యాన్ని సరసమైన ధరలకు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. ఇప్పటికే కిలో రూ.49 చొప్పున విక్రయిస్తున్న బీపీటీ రకం బియ్యంతోపాటు, తాజాగా కేఎన్‌ఎం, ఆర్‌ఎన్‌ఆర్ రకాల సన్నబియ్యాన్ని కూడా కిలో రూ.50కే విక్రయించనున్నారు. ఒక్కో కుటుంబానికి నెలకు గరిష్ఠంగా 26 కిలోల చొప్పున బియ్యం అందించనున్నారు. ఈ విక్రయాల ద్వారా మార్కెట్‌లో పెరుగుతున్న బియ్యం ధరల భారం నుంచి వినియోగదారులకు కొంత ఉపశమనం లభించే అవకాశం ఉంది. అక్టోబర్ 12న విజయవాడలోని భవానీపురం రైతు బజార్‌లో మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ విక్రయాలను లాంఛనంగా ప్రారంభించనున్నట్లు సమాచారం. అయితే, ఈ బియ్యం అన్ని రైతు బజార్లలో ఎప్పటి నుంచి అందుబాటులో ఉంటాయి, సరఫరా పరిమాణం ఎంత అనే వివరాలపై స్పష్టత రావాల్సి ఉంది.