స్థానిక ఎన్నికలకు ముందే ప్రజల నాడి తెలుసుకునే ప్రయత్నం
స్థానిక ఎన్నికల వేడి.. అప్పుడే ప్రజల నాడి పట్టుకునే పనిలో రాజకీయ పార్టీలు!
స్థానిక ఎన్నికల నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలు అప్పుడే ప్రజల నాడిని తెలుసుకునే ప్రయత్నాలు ప్రారంభించాయి. ఎన్నికల షెడ్యూల్‌పై స్పష్టత రాకముందే ఓటర్ల అభిప్రాయాలను సేకరించే దిశగా రాజకీయ వర్గాలు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా పలువురికి ఐవీఆర్‌ఎస్ (IVRS) ఫోన్ కాల్స్ వస్తున్నాయని ప్రజలు చెబుతున్నారు. “మీరు ఏ పార్టీకి ఓటు వేస్తారు? ఫలానా పార్టీకి మద్దతిస్తే 1 నొక్కండి.. మరో పార్టీకి మద్దతిస్తే 2 నొక్కండి.. ఇతర పార్టీలకు మద్దతిస్తే 3 నొక్కండి” అంటూ ప్రశ్నలు అడుగుతున్నట్లు వెల్లడిస్తున్నారు. ఈ కాల్స్ ద్వారా ఓటర్ల అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం జరుగుతోందని పలువురు భావిస్తున్నారు. అయితే, ఈ ఫోన్ కాల్స్ ఎవరి ఆధ్వర్యంలో వస్తున్నాయి? ఏ రాజకీయ పార్టీ లేదా సంస్థ వీటిని నిర్వహిస్తోంది? ప్రజల నుంచి సేకరిస్తున్న అభిప్రాయాలను ఏ విధంగా వినియోగించనున్నారు? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఎన్నికలకు ముందే ఓటర్ల అభిప్రాయాల సేకరణ ప్రారంభం కావడం స్థానిక రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.