పెనుగొలనులో ఘనంగా తొలి తెలుగు కవి పాల్కురికి సోమనాథుడి జయంతి
పెనుగొలనులో ఘనంగా పాల్కురికి సోమనాథుడి జయంతి వేడుకలు
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలోని శివాలయం ప్రాంగణంలో మంగళవారం శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో 12వ శతాబ్దానికి చెందిన తొలి తెలుగు కవుల్లో ఒకరైన పాల్కురికి సోమనాథుడి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన సభలో వక్తలు మాట్లాడుతూ పాల్కురికి సోమనాథుడు తెలుగు సాహిత్యానికి విశేష సేవలందించడంతో పాటు వీరశైవ మత ప్రచారానికి కృషి చేశారని కొనియాడారు. వరంగల్ సమీపంలోని పాల్కురికి గ్రామంలో విష్ణు రామదేవుడు, శ్రియాదేవి దంపతులకు జన్మించిన సోమనాథుడు తెలుగు, కన్నడ, సంస్కృత భాషల్లో పాండిత్యం సంపాదించారని వివరించారు. ఆయన రచించిన బసవపురాణం, పండితారాధ్య చరిత్ర, అనుభవసారం, చతుర్వేదసారం, చెన్నబసవ రగడ, సద్గురు రగడ, మల్లమదేవి పురాణం వంటి గ్రంథాలు విశేష ప్రాచుర్యం పొందాయని తెలిపారు. తెలుగు సాహిత్యంలో పాల్కురికి సోమనాథుడికి ప్రత్యేక స్థానం ఉందని, శివకవిత్రయంలో ఆయన ఒకరని పేర్కొన్నారు. అచ్చతెలుగు పదాలను, తెలుగు ఛందస్సును విరివిగా ఉపయోగించి సాహిత్యాన్ని ప్రజలకు చేరువ చేశారని అన్నారు. తన రచనల్లో ఆనాటి నాట్యకళలు, దేశీయ కళారూపాలు, సామాజిక జీవన విధానాలకు సంబంధించిన అంశాలను సైతం వివరించారని తెలిపారు. పాల్కురికి సోమనాథుడి సాహిత్య సేవలను స్మరించుకోవడం ద్వారా తెలుగు భాష, సాహిత్య వారసత్వాన్ని భావితరాలకు అందించవచ్చని వక్తలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజ్ఞాభారతి కరీంనగర్ ప్రధాన కార్యదర్శి మందల నగేష్ రెడ్డి, కరీంనగర్ సప్తగిరి ఉన్నత పాఠశాల ఉపాధ్యాయురాలు అనిత, విశ్రాంత ఉపాధ్యాయులు వేమవరపు హనుమంతరావు, ప్రగతి కాన్వెంట్ కరస్పాండెంట్ వెదురు వెంకటరెడ్డి, విశ్రాంత ఉపాధ్యాయురాలు వెదురు కోటేశ్వరి, వేమవరపు లక్ష్మి, ప్రజ్ఞాభారతి ప్రతినిధి వెచ్చా మురళి తదితరులు పాల్గొన్నారు.