స్థానిక ఎన్నికల్లో అభ్యర్థులకు భద్రత కల్పించాలి
మార్కాపురం జిల్లా ఎస్పీకి దద్దాల నారాయణ యాదవ్ వినతి
మార్కాపురం:
నూతనంగా నియమితులైన మార్కాపురం జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ (ఎస్పీ) పంకజ్ కుమార్ మీనాను కనిగిరి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌ఛార్జి డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ మంగళవారం ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీకి శుభాకాంక్షలు తెలిపి, దుశ్శాలువతో సత్కరించి పుష్పగుచ్ఛం అందజేశారు.
త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎస్పీకి వినతిపత్రం సమర్పించారు. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు పోటీలో ఉన్న అభ్యర్థులందరికీ తగిన భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
నామినేషన్ల దాఖలు సమయంలో అభ్యర్థులకు రక్షణ కల్పించాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని దద్దాల నారాయణ యాదవ్ కోరారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అవసరాన్ని బట్టి కేంద్ర బలగాలను మోహరించి ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.
ఎన్నికల ప్రచార సమయంలో అభ్యర్థులు స్వేచ్ఛగా, భయం లేకుండా తమ ప్రచారాన్ని కొనసాగించేందుకు తగిన పోలీసు భద్రత కల్పించాలని పేర్కొన్నారు. పోలింగ్, ఓట్ల లెక్కింపు సహా ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు అభ్యర్థుల రక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని దద్దాల నారాయణ యాదవ్ విజ్ఞప్తి చేశారు. పోలీసు శాఖ నిష్పక్షపాతంగా వ్యవహరించి, స్థానిక సంస్థల ఎన్నికలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంతంగా ముగిసేందుకు సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు గోపవరపు బొర్రారెడ్డి, యక్కంటి శ్రీనివాసుల రెడ్డి, సూరసాని మోహన్ రెడ్డి, చింతకుంట్ల సాల్మన్ రాజు, కటికల వెంకటరత్నం, గాండ్లపర్తి ఆదినారాయణ రెడ్డి, మితికాల గురవయ్య, భువనగిరి వెంకటయ్య, పిల్లి లక్ష్మీనారాయణ రెడ్డి, పల్నాటి భాస్కర్ రెడ్డి, వాకమల్ల రాజశేఖర్ రెడ్డి, సైకం ఏడుకొండలు రెడ్డి, మితికాల వరుణ్ కుమార్, రామనబోయిన శ్రీనివాసులు యాదవ్, గోబ్బిళ్ళ శ్రీనివాస్ యాదవ్, బైరెడ్డి తిరుపతిరెడ్డి, మన్నేపల్లి పెద్దన్న తదితరులు పాల్గొన్నారు.