సిపిఐ నాయకులు సుబ్రహ్మణ్యం పార్దేవదేహాన్ని మెడికల్ కాలేజీకి అప్పగింత ..
ఉపాధ్యాయుడిగా, కమ్యూనిస్టు నాయకుడిగా, సాహితీవేత్తగా విశిష్ట సేవలు
కనిగిరి: సీపీఐ పార్టీ సీనియర్ నాయకులు, రిటైర్డ్ ఉపాధ్యాయులు, ఎస్‌టీయూ రాష్ట్ర మాజీ అధ్యక్షులు బృంగి సుబ్రహ్మణ్యం ఆదివారం సేలంలో మృతి చెందారు. ఆయన పార్థివదేహాన్ని సోమవారం కనిగిరిలోని స్వగృహానికి తీసుకురాగా సీపీఐ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా సీపీఐ మార్కాపురం జిల్లా కార్యదర్శి ఎం.ఎల్. నారాయణ, సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు సయ్యద్ యాసిన్ మాట్లాడుతూ.. బృంగి సుబ్రహ్మణ్యం సామ్యవాద సిద్ధాంతాలను స్వీకరించి ఉపాధ్యాయుడిగా విశిష్ట సేవలు అందించారని తెలిపారు. తన బోధన ద్వారా ఎందరో విద్యార్థులను తీర్చిదిద్ది, వారిని నవసమాజ నిర్మాతలుగా తయారు చేయడంలో కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు.
సాహితీవేత్తగా, కమ్యూనిస్టు నాయకుడిగా, నిజాయితీ గల ఉపాధ్యాయుడిగా, విప్లవ కళాకారుడిగా సుబ్రహ్మణ్యం అందించిన సేవలు చిరస్మరణీయమని వారు అన్నారు. ఎల్లప్పుడూ చిరునవ్వుతో అందరితో కలిసిమెలిసి ఉండే ఆయన ఎందరికో మార్గదర్శకుడిగా నిలిచారని పేర్కొన్నారు.
బృంగి సుబ్రహ్మణ్యం మృతి సీపీఐ పార్టీకి, ఉపాధ్యాయ రంగానికి, సాహిత్య మరియు కళా రంగాలకు తీరని లోటని వారు అన్నారు. ఆయనకు ఘన నివాళులు అర్పిస్తూ, వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు రవీంద్రబాబు, అందె నాసరయ్య, సయ్యద్ మౌలాలి, పోతల ప్రభాకర్, సీపీఐ మండల కార్యదర్శి గులాం హుస్సేన్, నియోజకవర్గ సహాయ కార్యదర్శి వజ్రాల సుబ్బారావు, పందిటి మోహన్, పాలపర్తి మస్తాన్, పామూరు సీపీఐ నాయకులు, ఏఐఎస్ఎఫ్ నాయకులు పవన్ కళ్యాణ్, రాగిపాటి సూరిబాబు, బాలకోటయ్య, గొర్రెముచ్చు తిరుపాలు, వెలుగొండయ్య, షరీఫ్, అమరుల్లా, పీవీ శేషయ్య తదితరులు పాల్గొని నివాళులర్పించారు.
సుబ్రహ్మణ్యం కోరిక మేరకు మెడికల్ కాలేజీకి పార్థివదేహం
బృంగి సుబ్రహ్మణ్యం తన మరణానంతరం పార్థివదేహాన్ని వైద్య విద్యార్థుల అధ్యయనం కోసం మెడికల్ కాలేజీకి అప్పగించాలని కోరుకున్నారు. ఆయన కోరికను నెరవేర్చేందుకు సీపీఐ నాయకులు కుటుంబ సభ్యులతో కలిసి చర్యలు చేపట్టారు.
స్థానిక వైద్యశాల సూపరింటెండెంట్ సురేష్ సూచనల మేరకు మెడికల్ కాలేజీ అధికారులతో సంప్రదింపులు జరిపారు. అనంతరం కుటుంబ సభ్యులు, సీపీఐ నాయకుల సమక్షంలో బృంగి సుబ్రహ్మణ్యం పార్థివదేహాన్ని ఒంగోలు మెడికల్ కాలేజీకి అప్పగించారు.
సుబ్రహ్మణ్యం తన జీవితాంతం ప్రజా సేవ, విద్యా రంగం, సామ్యవాద సిద్ధాంతాల పట్ల అంకితభావంతో పనిచేశారని, ఆయన ఆశయాలు, సేవలు భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని సీపీఐ నాయకులు పేర్కొన్నారు.