నెమలి వేణుగోపాల స్వామి ఆలయంలో వైభవంగా ధైర్యలక్ష్మి అలంకరణ
భక్తిశ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకున్న భక్తులు
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం నెమలి గ్రామంలోని శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానంలో దసరా ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రాజ్యలక్ష్మి అమ్మవారికి ధైర్యలక్ష్మి అలంకరణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేపట్టారు.
ఆలయ అర్చకులు గోపాలాచార్యులు ముందుగా స్వామివారికి, అమ్మవార్లకు వివిధ రకాల పుష్పాలు, తులసి దళాలతో అష్టోత్తర శతనామావళి పూజ నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో గోమాతకు ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా ఎన్టీఆర్, కృష్ణా, ఖమ్మం జిల్లాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని స్వామివారిని, అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ సహాయ కమిషనర్ ఎన్. సంధ్య, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.