భారీ నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు
ఇరాన్–అమెరికా ఉద్రిక్తతలు.. పెరిగిన క్రూడాయిల్ ధరల ప్రభావం
ముంబై, సెప్టెంబర్ 28:
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ప్రారంభ ట్రేడింగ్‌లో నిఫ్టీ 213.8 పాయింట్లు నష్టపోయి 22,926.7 వద్ద, సెన్సెక్స్ 694 పాయింట్లు కోల్పోయి 73,201 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది.
సెన్సెక్స్‌లో టీసీఎస్ మినహా మిగతా స్టాక్స్ నష్టాల్లో ట్రేడవుతున్నట్లు మార్కెట్ సమాచారం వెల్లడించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ ప్రతిపాదనను తిరస్కరించడంతో మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇరాన్ ప్రతిపాదనలో హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవడం, చర్చలను కొనసాగించడం వంటి అంశాలు ఉన్నట్లు అంతర్జాతీయ నివేదికలు పేర్కొన్నాయి.
ఈ పరిణామాల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లలో క్రూడాయిల్ ధరలు పెరిగాయి. సోమవారం బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 1 శాతానికి పైగా పెరిగి బ్యారెల్‌కు సుమారు 106 డాలర్లకు చేరాయి. హార్ముజ్ జలసంధి ద్వారా చమురు సరఫరాపై నెలకొన్న అనిశ్చితి ధరలపై ప్రభావం చూపుతోంది.
భారత్ వంటి చమురు దిగుమతులపై ఆధారపడే దేశాలకు క్రూడాయిల్ ధరల పెరుగుదల ఇంధన వ్యయాలు, ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపే అవకాశం ఉండటంతో మార్కెట్ పెట్టుబడిదారులు అంతర్జాతీయ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారు.
డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ కూడా స్వల్పంగా బలహీనపడినట్లు మార్కెట్ సమాచారం వెల్లడించింది. మార్కెట్‌లో చమురు ధరలు, భౌగోళిక రాజకీయ పరిణామాలు, విదేశీ పెట్టుబడుల ప్రవాహం వంటి అంశాలు కీలకంగా మారాయి.