ఒకే రోజు 5 లక్షల మందికి ఉపాధి హామీ పనులు
తెలంగాణలో సరికొత్త రికార్డు.. 53 వేల మంది కూలీలతో నల్లగొండ జిల్లా అగ్రస్థానం
యాదాద్రి భువనగిరి, నవంబర్ 4 (ఎన్ టుడే న్యూస్): తెలంగాణలో ఉపాధి హామీ పథకం కింద సరికొత్త రికార్డు నమోదైంది. వీబీజీ రామ్ జీ పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజు సుమారు 5 లక్షల మంది కూలీలు ఉపాధి పనులకు హాజరయ్యారు. నవంబర్ నెలలో ఈ స్థాయిలో కూలీలకు పని కల్పించడం ఇదే తొలిసారని అధికారులు వెల్లడించినట్లు సమాచారం.
నల్లగొండ జిల్లాకు అగ్రస్థానం
ఉపాధి హామీ పనుల్లో నల్లగొండ జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. జిల్లావ్యాప్తంగా సుమారు 53 వేల మంది కూలీలు ఒకే రోజు పనులకు హాజరయ్యారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయనేందుకు ఈ సంఖ్య నిదర్శనంగా నిలుస్తోంది.
మంత్రి సీతక్క హర్షం
రాష్ట్రవ్యాప్తంగా నమోదైన ఈ రికార్డుపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో కూలీలకు నిరంతరం ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
జల సంరక్షణ పనులకు ప్రాధాన్యం
ఉపాధి హామీ పనుల్లో భాగంగా జల సంరక్షణకు సంబంధించిన పనులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో నీటి వనరుల అభివృద్ధి, వర్షపు నీటి సంరక్షణకు ఉపయోగపడే పనులను ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని సూచించారు.