విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర ప్రమాదం
విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర ప్రమాదం.. ఈవీ కారులో నలుగురు సజీవదహనం డివైడర్‌ను ఢీకొని మంటల్లో చిక్కుకున్న కారు.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలు ఎన్టీఆర్ జిల్లా: విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. డివైడర్‌ను ఢీకొన్న ఎలక్ట్రిక్ కారు (ఈవీ)లో ఒక్కసారిగా మంటలు చెలరేగి కారు పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో నలుగురు సజీవదహనమై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. నంబూరులో జరిగిన శుభకార్యానికి హాజరై తిరిగి వస్తుండగా ఈ విషాద ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. మృతుల్లో నున్నకు చెందిన కొమ్మారెడ్డి రాందేవ్ (39), ఆయన తల్లి అరుణతో పాటు మరో చిన్నారి, నంబూరుకు చెందిన తిగురు విజయ ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి తీవ్రంగా గాయపడిన వ్యక్తిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. క్షణాల్లో జరిగిన ఈ ఘోర ప్రమాదంతో బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రమాదానికి గల పూర్తి కారణాలు, మృతుల వివరాలపై పోలీసుల విచారణ అనంతరం మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.