బీసీ కుల సంఘాలకు శుభవార్త.. ఆత్మగౌరవ భవనాలకు రూ.88.50 కోట్లు మంజూరు
38 కుల సంఘాల ప్రతినిధులకు జీవో పత్రాలు అందజేసిన మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్, నవంబర్ 5 (ఎన్ టుడే న్యూస్): తెలంగాణలో బీసీ కుల సంఘాల ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి ప్రభుత్వం రూ.88.50 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. కుల సంఘాలకు గతంలో కేటాయించిన భూములను ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు.
38 కుల సంఘాలకు జీవో పత్రాల అందజేత
ఈ మేరకు 38 కుల సంఘాల ప్రతినిధులకు ప్రభుత్వం మంజూరు చేసిన నిధులకు సంబంధించిన జీవో పత్రాలను మంత్రి అందజేశారు. ఆత్మగౌరవ భవనాల నిర్మాణాలకు త్వరితగతిన చర్యలు చేపట్టాలని సూచించారు.
ఏడాదిలోగా నిర్మాణాలు పూర్తి చేయాలి
కార్తీక మాసంలోనే ఆత్మగౌరవ భవనాల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. నిర్మాణ పనులను ప్రారంభించి ఏడాదిలోగా పూర్తి చేసేలా కుల సంఘాల ప్రతినిధులు చొరవ తీసుకోవాలని కోరారు.
బీసీ కుల సంఘాల ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంపై ఆయా సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.