మదనపల్లె పోలీసు కార్యాలయంలో ఘనంగా గురజాడ జయంతి
అన్నమయ్య జిల్లా, మదనపల్లె: మహాకవి గురజాడ వెంకట అప్పారావు జయంతిని పురస్కరించుకుని మదనపల్లె జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.
జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమానికి అదనపు ఎస్పీ (పరిపాలన) ఎం. వెంకటాద్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గురజాడ వెంకట అప్పారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ.. ‘కన్యాశుల్కం’ వంటి రచనల ద్వారా మహిళా అభ్యుదయానికి గురజాడ చేసిన కృషి చిరస్మరణీయమన్నారు. “దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయ్” అనే సందేశం ద్వారా సమాజం పట్ల బాధ్యత, మానవత్వం, సామాజిక చైతన్యాన్ని ప్రజల్లో పెంపొందించారని పేర్కొన్నారు.
గురజాడ రచనలు, సామాజిక ఆలోచనలు నేటి తరానికి కూడా స్ఫూర్తిదాయకమని, ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆర్‌ఐలు యు. రంగనాథ్ బాబు, కె. సురేష్ కుమార్ రెడ్డి, ఇతర పోలీసు అధికారులు, కార్యాలయ సిబ్బంది, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.