తెలంగాణలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన..
30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులు
హైదరాబాద్: తెలంగాణలో పలు జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.
నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, మెదక్, కామారెడ్డి, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
వర్షాల సమయంలో కొన్ని ప్రాంతాల్లో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వాతావరణం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
వర్షం కురిసే సమయంలో అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, విద్యుత్ స్తంభాలు, చెట్లు, బహిరంగ ప్రదేశాల్లో ఉండకుండా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని సూచించారు.