గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికపై మండల స్థాయి సమావేశం
45 రోజుల కార్యాచరణలో భాగంగా సమావేశం.. నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపుపై చర్చ
యాదాద్రి భువనగిరి జిల్లా, వలిగొండ, నవంబర్ 4 (ఎన్ టుడే న్యూస్): గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలో భాగంగా చేపట్టిన 45 రోజుల కార్యాచరణలో భాగంగా వలిగొండ మండల పరిషత్ కార్యాలయంలో మండల స్థాయి సమావేశం నిర్వహించారు. పంచాయతీరాజ్ శాఖ కమిషనర్, హైదరాబాద్ వారి ఆదేశాల మేరకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
అభివృద్ధి కార్యక్రమాలపై సర్పంచులకు అవగాహన
ఈ సందర్భంగా వివిధ శాఖలకు చెందిన అధికారులు తమ శాఖల పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలు, గ్రామ పంచాయతీలకు సంబంధించిన అంశాలపై సర్పంచులకు వివరించారు. గ్రామాల సమగ్ర అభివృద్ధికి శాఖల మధ్య సమన్వయంతో పనిచేయాల్సిన అవసరాన్ని వివరించారు.
ఎల్‌నినో ప్రభావాలు.. నీటి సంరక్షణపై చర్చ
ప్రత్యేకంగా ఎల్‌నినో ప్రభావాల వల్ల కలిగే పరిణామాలు, వాటిని ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై సమావేశంలో చర్చించారు. నీటి సంరక్షణ, వర్షపు నీటి నిల్వ, భూగర్భ జలాల పెంపుదల వంటి అంశాలపై అధికారులు సర్పంచులకు అవగాహన కల్పించారు.
అధికారులు, ప్రజాప్రతినిధుల హాజరు
వలిగొండ మండల ప్రత్యేక అధికారి జగన్నాథరావు మార్గదర్శకత్వంలో నిర్వహించిన ఈ సమావేశానికి మండల పరిషత్ అభివృద్ధి అధికారి జి. జలంధర్ రెడ్డి, తహసీల్దార్ దశరథ నాయక్, మండల పంచాయతీ అధికారి వై. ప్రేమలత, పీఏసీఎస్ ఆరూరు చైర్మన్ సి. వెంకట రామ్ రెడ్డి, మండల విద్యాశాఖ అధికారి ఎస్. భాస్కర్, ఏపీఓ పరశురాములు, పశువైద్యాధికారి అనిల్ రెడ్డి, మండల వ్యవసాయ అధికారి అంజనీ దేవి, ఏఈఈ (పంచాయతీరాజ్) సందీప్ రెడ్డి, ఏఈఈ (ఆర్‌డబ్ల్యూఎస్) శ్రీకీర్తి, మిషన్ భగీరథ ఏఈ సుమిత్, ఐసీడీఎస్ సూపర్‌వైజర్ పి. పారిజాత, విద్యుత్ శాఖ ఏఈ జె. నరసింహతో పాటు మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.