స్థానిక సంస్థల ఎన్నికలు పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించాలి
కలెక్టర్‌కు దద్దాల నారాయణ యాదవ్ వినతి
మార్కాపురం:
మార్కాపురం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీతను కనిగిరి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌ఛార్జి డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు.
కనిగిరి నియోజకవర్గంలోని మున్సిపాలిటీ వార్డులతో పాటు ఆరు మండలాల్లో ఉన్న సున్నిత, అత్యంత సున్నిత ప్రాంతాలు, పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన వివరాలను కలెక్టర్‌కు అందజేశారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, అధిక ప్రమాదం ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.
సున్నితమైన, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద స్థానిక పోలీసులతో పాటు అవసరమైన అదనపు కేంద్ర బలగాలను మోహరించాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. అధిక ప్రమాదం ఉన్న ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల లోపల, బయట సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, పోలింగ్ ప్రక్రియను జిల్లా నిఘా కేంద్రం నుంచి నేరుగా పర్యవేక్షించేలా వెబ్‌కాస్టింగ్ సదుపాయం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
పోలింగ్ కేంద్రాల పరిసర ప్రాంతాలు, గ్రామాలు, పట్టణాల్లోని ప్రధాన కూడళ్ల వద్ద ప్రత్యేక నిఘా బృందాలను ఏర్పాటు చేసి ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నాలను అడ్డుకోవాలని కోరారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా, ప్రతి ఓటరూ స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను అభ్యర్థించారు.
కూటమి ప్రభుత్వ పాలనలో ప్రతిపక్ష అభ్యర్థులు బెదిరింపులు, దాడులు, రాజకీయ ప్రేరేపిత పోలీసు చర్యలు, రాజకీయ కార్యకలాపాలకు ఆటంకాలు ఎదుర్కొంటున్నారని దద్దాల నారాయణ యాదవ్ తన వినతిపత్రంలో ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇటువంటి పరిస్థితులు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రతిపక్ష అభ్యర్థులను నామినేషన్లు దాఖలు చేయకుండా అడ్డుకోవడం, నామినేషన్లు ఉపసంహరించుకునేలా ఒత్తిడి చేయడం, ఎన్నికల ప్రచారానికి ఆటంకాలు కల్పించడం వంటి ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు అభ్యర్థులకు తగిన భద్రత కల్పించాలని, ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేలా అవసరమైన నివారణ చర్యలు చేపట్టాలని కలెక్టర్‌కు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు గోపవరపు బొర్రారెడ్డి, యక్కంటి శ్రీనివాసుల రెడ్డి, సూరసాని మోహన్ రెడ్డి, చింతకుంట్ల సాల్మన్ రాజు, కటికల వెంకటరత్నం, గాండ్లపర్తి ఆదినారాయణ రెడ్డి, మితికాల గురవయ్య, భువనగిరి వెంకటయ్య, పిల్లి లక్ష్మీనారాయణ రెడ్డి, పల్నాటి భాస్కర్ రెడ్డి, వాకమల్ల రాజశేఖర్ రెడ్డి, సైకం ఏడుకొండలు రెడ్డి, మితికాల వరుణ్ కుమార్, రామనబోయిన శ్రీనివాసులు యాదవ్, గోబ్బిళ్ళ శ్రీనివాస్ యాదవ్, బైరెడ్డి తిరుపతిరెడ్డి, మన్నేపల్లి పెద్దన్న తదితరులు పాల్గొన్నారు.