బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన మధుసూదన్ నాయుడు దంపతులు
చౌడేపల్లి, అన్నమయ్య జిల్లా: చౌడేపల్లి మండలం దిగువపల్లి గ్రామంలోని ప్రసిద్ధ బోయకొండ గంగమ్మ దేవస్థానంలో దసరా నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు అమ్మవారు బాల త్రిపుర సుందరీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌ఛార్జి మధుసూదన్ నాయుడు దంపతులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.
దసరా మహోత్సవాలను పురస్కరించుకుని ఆలయాన్ని వివిధ రకాల పుష్పాలు, పండ్లతో అలంకరించారు. అమ్మవారి విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించి, వివిధ హోమాలు నిర్వహించారు. అనంతరం పూర్ణాహుతి, హారతి కార్యక్రమాలతో ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న మధుసూదన్ నాయుడు దంపతులకు ఆలయ అధికారులు, సిబ్బంది సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు.
ఆలయ ఈవో, ఉప కమిషనర్ ఏకాంబరం ఆలయ సంప్రదాయాల ప్రకారం మధుసూదన్ నాయుడు దంపతులను ఆహ్వానించి అమ్మవారి దర్శనం కల్పించారు. అనంతరం వారిని కుంకుమార్చన కార్యక్రమంలో భాగస్వాములను చేశారు.
ఈ సందర్భంగా మధుసూదన్ నాయుడు మాట్లాడుతూ బోయకొండ గంగమ్మ ఆశీస్సులతో కూటమి ప్రభుత్వం ప్రజల కోసం అనేక కార్యక్రమాలు చేపడుతోందని తెలిపారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించే అవకాశం లభించడం పూర్వజన్మ పుణ్యఫలంగా భావిస్తున్నానన్నారు. అమ్మవారి ఆశీస్సులు ప్రభుత్వం, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, అభిమానులపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించినట్లు చెప్పారు.
దసరా నవరాత్రి ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని ఆలయ ఈవోను కోరారు. ఉత్సవాలకు నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. ఉత్సవాల్లో ఉభయదారులుగా మంజుల, రామోజీ గౌడ్ (బెంగళూరు), విజయలక్ష్మి, శివప్రకాష్, నరసింహులు, లక్ష్మి, లిఖిత్ రెడ్డి, చంద్రిక, సురేంద్ర కుమార్ (రైల్వేకోడూరు) వ్యవహరించారు.