మంచినీటి సమస్య పరిష్కరించాలని ఎన్. గొల్లపల్లి ఎస్సీ కాలనీవాసుల నిరసన
ఆంధ్రప్రదేశ్
/
మార్కాపురం
/
కనిగిరి
కనిగిరి:
కనిగిరి మండలం ఎన్. గొల్లపల్లి ఎస్సీ కాలనీలో మంచినీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం స్థానికులు రోడ్డెక్కారు. ఖాళీ బిందెలు, ప్లకార్డులు చేతబట్టి నిరసన వ్యక్తం చేశారు.
సాగర్ పైప్‌లైన్ తమ రెండు కాలనీల మీదుగా గ్రామంలోకి వెళ్తున్నప్పటికీ, తమ కాలనీలకు కుళాయి కనెక్షన్లు లేకపోవడంతో తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. పైప్‌లైన్ అందుబాటులో ఉన్నప్పటికీ తమకు నీటి సరఫరా కల్పించకపోవడం వల్ల దూర ప్రాంతాల నుంచి నీటిని తెచ్చుకోవాల్సి వస్తోందని తెలిపారు.
దళిత కాలనీల్లో కనీస వసతులు కల్పించేందుకు అధికారులు చొరవ చూపాలని వారు కోరారు. తమ కాలనీలకు వెంటనే కుళాయి కనెక్షన్లు ఏర్పాటు చేసి, మంచినీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని అధికారులను డిమాండ్ చేశారు.