చదళ్లలో వైభవంగా శరవన్నవరాత్రి ఉత్సవాలు..
మధుర మీనాక్షి దేవిగా చౌడేశ్వరి అమ్మవారు
పుంగనూరు, అన్నమయ్య జిల్లా: పుంగనూరు మండలం చదళ్ల గ్రామంలోని సప్తమాతృక సమేత శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయంలో శరవన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం అమ్మవారు మధుర మీనాక్షి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు.
ఆలయ వ్యవస్థాపకుడు డాక్టర్ ఎన్. వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. వివిధ రాష్ట్రాల నుంచి తెప్పించిన సువాసనభరిత పుష్పాలతో ఆలయాన్ని సుందరంగా అలంకరించారు.
ఉత్సవాల్లో భాగంగా గణపతి పూజ, గణపతి హోమం, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి హోమం, పుణ్యాహవచనం, సప్తమాతృకల ఆరాధనతో పాటు శ్రీ చౌడేశ్వరి దేవి మూలమంత్ర హోమయాగాన్ని నిర్వహించారు. అనంతరం అమ్మవారిని మధుర మీనాక్షి దేవిగా ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు.
ఈ సందర్భంగా వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో నిర్వహించే తరహాలోనే శ్రీ చౌడేశ్వరి దేవికి ప్రత్యేక అలంకరణలు, పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు.