BREAKING
thumb ● ప్రభుత్వ భూములను ప్రజా అవసరాలకే వినియోగించాలి thumb ● యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు thumb ● ఎర్రబెల్లిగూడెం సర్పంచ్ సోదరుడి వివాహ వేడుకకు హాజరైన కాంగ్రెస్ నాయకులు thumb ● ఎటురోజు ఓంకార్ పార్ధివదేహానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు thumb ● కేసముద్రం సర్కిల్ పోలీస్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఇన్‌చార్జి డీఐజీ ఎన్. శ్వేత thumb ● గోపాలపురంలో భూ రీ సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ thumb ● చలో అచ్చంపేట.. బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలి thumb ● పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం thumb ● కోనూరు గోపాల్ చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే మందుల సామెల్ thumb ● పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు చలమల్ల కృష్ణారెడ్డి thumb ● ప్రభుత్వ భూములను ప్రజా అవసరాలకే వినియోగించాలి thumb ● యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు thumb ● ఎర్రబెల్లిగూడెం సర్పంచ్ సోదరుడి వివాహ వేడుకకు హాజరైన కాంగ్రెస్ నాయకులు thumb ● ఎటురోజు ఓంకార్ పార్ధివదేహానికి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు thumb ● కేసముద్రం సర్కిల్ పోలీస్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఇన్‌చార్జి డీఐజీ ఎన్. శ్వేత thumb ● గోపాలపురంలో భూ రీ సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ thumb ● చలో అచ్చంపేట.. బహిరంగ సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలి thumb ● పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం thumb ● కోనూరు గోపాల్ చిత్రపటానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే మందుల సామెల్ thumb ● పలు వివాహ వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు చలమల్ల కృష్ణారెడ్డి
Test 4
Date of Publish : 25 November 2026, 08:32 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

రాజ్యాంగ రక్షణే ప్రజాస్వామ్య పరిరక్షణ

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 Nov, 2026 - 08:32 AM
15 వీక్షణలు

 నవంబర్ 26 రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక సంపాదకీయం భారత రాజ్యాంగం దేశ ప్రజలకు అంకితమై 77 ఏళ్లు పూర్తవుతున్నాయి. 1949 నవంబర్ 26న రాజ్యాంగ నిర్మాణ సభ భారత రాజ్యాంగాన్ని ఆమోదించింది. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అధ్యక్షతన కొనసాగిన రాజ్యాంగ రచనా కమిటీ దేశానికి ఒక సమగ్రమైన లిఖిత రాజ్యాంగాన్ని అందించింది. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సుదీర్ఘ కృషి, మేధోమథనం, అనేక చర్చల ఫలితంగా రూపుదిద్దుకున్న భారత రాజ్యాంగం ప్రజాస్వామ్యానికి పునాదిగా నిలిచింది. 1950 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చిన ఈ రాజ్యాంగం దేశంలోని ప్రతి పౌరుడికి హక్కులు, స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం కల్పించాలనే గొప్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత రాజ్యాంగ రూపకల్పన వెనుక స్వాతంత్ర్య పోరాటాల త్యాగాలు, ప్రజా ఉద్యమాల స్ఫూర్తి దాగి ఉన్నాయి. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సాగిన పోరాటాల్లో విద్యార్థులు, కార్మికులు, రైతులు కీలక పాత్ర పోషించారు. ఆలిండియా స్టూడెంట్ ఫెడరేషన్, ఆలిండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్, ఆలిండియా కిసాన్ సభ వంటి సంఘాలు ప్రజలను సంఘటితం చేసి హక్కుల కోసం పోరాటాలకు నాయకత్వం వహించాయి. కేరళలో పున్నప్ర వాయలార్ ఉద్యమం, మహారాష్ట్రలో వర్లి ఆదివాసీల పోరాటం, బెంగాల్‌లో తెభాగా రైతాంగ ఉద్యమం, బొంబాయి కార్మికుల పోరాటాలు, వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం దేశ సామాజిక, రాజకీయ చరిత్రలో చెరగని ముద్ర వేశాయి. అనేకమంది ప్రాణత్యాగాలు, జైలు జీవితాలు, నిర్బంధాలు, పోలీసుల దాడుల మధ్య సాగిన ఈ ఉద్యమాలు ప్రజాస్వామ్య ఆకాంక్షలకు బలమైన పునాదులు వేశాయి. రాజ్యాంగంలోని మూడో భాగంలో పొందుపరిచిన ప్రాథమిక హక్కులు, నాలుగో భాగంలోని ఆదేశిక సూత్రాలు దేశ ప్రజల భవిష్యత్తుకు దిశానిర్దేశం చేస్తాయి. చట్టం ముందు అందరూ సమానులేనని, కులం, మతం, ప్రాంతం, భాష ఆధారంగా వివక్ష చూపకూడదని రాజ్యాంగం స్పష్టం చేసింది. రాజ్యాంగ ప్రవేశికలోని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర భావనలు భారతదేశ సమైక్యతకు, ప్రజల సమాన హక్కులకు ప్రతీకలుగా నిలుస్తున్నాయి. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, సామాజిక న్యాయం అనే విలువలు రాజ్యాంగానికి ప్రాణాధారాలు. అయితే రాజ్యాంగం అమల్లోకి వచ్చి ఏడు దశాబ్దాలకు పైగా గడిచినా సమాజంలో కుల వివక్ష పూర్తిగా తొలగిపోలేదు. అంటరానితనాన్ని నేరంగా ప్రకటించినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ రెండు గ్లాసుల పద్ధతి కొనసాగుతోంది. దేవాలయాల్లో ప్రవేశానికి అడ్డంకులు, పండుగలు, సామాజిక కార్యక్రమాల్లో వివక్ష, దళితులు వండిన ఆహారాన్ని నిరాకరించడం వంటి ఘటనలు సమాజంలో అసమానతలు ఇంకా కొనసాగుతున్నాయనే విషయాన్ని గుర్తుచేస్తున్నాయి. వివక్షను ప్రశ్నించే వారిపై దాడులు, బెదిరింపులు, దౌర్జన్యాలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. రాజ్యాంగం కల్పించిన సమానత్వ హక్కు కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా ప్రతి ఒక్కరి జీవితంలో అమలైనప్పుడే దాని లక్ష్యం నెరవేరుతుంది. ఉద్యోగాలు, విద్య, సామాజిక అవకాశాల్లోనూ సమానత్వం సాధించాల్సిన అవసరం ఉంది. కులాంతర వివాహాల నేపథ్యంలో జరిగే హత్యలు, సామాజిక ఆధిపత్యం పేరుతో కొనసాగుతున్న దాడులు ప్రజాస్వామ్య విలువలకు సవాలుగా నిలుస్తున్నాయి. మంథని మధుకర్, అంబోజి నరేష్, పెరుమాండ్ల ప్రణయ్ వంటి ఘటనలు కుల వివక్ష ఎంతటి విషాదాలకు దారితీస్తుందో గుర్తుచేస్తున్నాయి. చట్టాలు చేయడంతోనే మార్పు రాదు. వాటిని నిష్పక్షపాతంగా అమలు చేయడం, బాధితులకు న్యాయం అందించడం, వివక్షకు వ్యతిరేకంగా సామాజిక చైతన్యం పెంపొందించడం కూడా అంతే ముఖ్యం. లౌకికత్వం భారత రాజ్యాంగ మౌలిక విలువల్లో ఒకటి. అన్ని మతాల ప్రజలకు సమాన గౌరవం, విశ్వాస స్వేచ్ఛ కల్పించడం రాజ్యాంగ లక్ష్యం. రాజకీయ ప్రయోజనాల కోసం మతాన్ని ఉపయోగించడం, మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టడం, ఒక వర్గంపై మరో వర్గానికి వ్యతిరేకంగా ద్వేష భావాలు పెంచడం దేశ సామాజిక ఐక్యతకు విఘాతం కలిగిస్తాయి. ప్రజల మధ్య మత సామరస్యం, పరస్పర గౌరవం, సోదరభావం కొనసాగినప్పుడే రాజ్యాంగంలోని లౌకిక స్ఫూర్తి నిలబడుతుంది. చరిత్రను వక్రీకరించకుండా, భిన్నత్వంలో ఏకత్వాన్ని గౌరవిస్తూ ముందుకు సాగాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. విద్య, వైద్యం వంటి మౌలిక అవసరాలు సామాన్యులకు అందుబాటులో ఉండటం కూడా సామాజిక న్యాయంలో భాగమే. నాణ్యమైన విద్య, వైద్యం ఆర్థిక స్థోమత ఉన్నవారికే పరిమితమైతే సమాజంలో అసమానతలు మరింత పెరుగుతాయి. ప్రభుత్వ విద్యాసంస్థలు, ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేయడం, పేదలకు నాణ్యమైన సేవలు అందించడం ప్రభుత్వాల బాధ్యత. ప్రభుత్వ రంగ సంస్థల ప్రాధాన్యతను కాపాడటం, ప్రజలకు అవసరమైన సేవలను అందుబాటులో ఉంచడం ద్వారా సామాజిక, ఆర్థిక సమానత్వానికి బాటలు వేయవచ్చు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చేసిన హెచ్చరికలు ఈ సందర్భంగా గుర్తుచేసుకోవాలి. రాజ్యాంగం ఎంత గొప్పదైనా దాన్ని అమలు చేసే పాలకుల విధానాలు, ప్రజాస్వామ్య విలువల పట్ల వారి నిబద్ధతపై దాని ఫలితాలు ఆధారపడి ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. రాజకీయ సమానత్వంతోపాటు సామాజిక, ఆర్థిక సమానత్వం సాధించాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. ఒక మనిషికి ఒక ఓటు, ఒక ఓటుకు ఒక విలువ అనే రాజకీయ సమానత్వం అమల్లో ఉన్నప్పటికీ సమాజంలో ఆర్థిక, సామాజిక అసమానతలు కొనసాగితే ప్రజాస్వామ్య లక్ష్యం పూర్తిస్థాయిలో నెరవేరదు. రాజ్యాంగాన్ని కాపాడుకోవడం అంటే కేవలం రాజ్యాంగ దినోత్సవం రోజున వేడుకలు నిర్వహించడం, రాజ్యాంగ ప్రవేశికను చదవడం మాత్రమే కాదు. రాజ్యాంగం కల్పించిన హక్కులపై అవగాహన పెంచుకోవాలి. కుల, మత, ప్రాంతీయ విభేదాలకు అతీతంగా ప్రజలంతా ఐక్యంగా ఉండాలి. ప్రభుత్వాలు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించేలా ప్రశ్నించే పౌర సమాజం బలపడాలి. విద్య, వైద్యం, ఉపాధి, సామాజిక న్యాయం ప్రతి ఒక్కరికీ అందేలా కృషి జరగాలి. ప్రజాస్వామ్య సంస్థల స్వతంత్రత, పౌరుల హక్కులు, భావప్రకటనా స్వేచ్ఛకు తగిన గౌరవం దక్కాలి. రాజ్యాంగం మనకు అందించిన హక్కులను కాపాడుకోవడంతోపాటు దాని బాధ్యతలను కూడా గుర్తించాలి. ప్రజాస్వామ్యం కేవలం ఓటు హక్కుతో ముగిసిపోయేది కాదు. సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం ప్రజల రోజువారీ జీవితాల్లో ప్రతిబింబించాలి. రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడటం ప్రతి పౌరుడి బాధ్యతగా భావించాలి. అప్పుడే అంబేద్కర్ ఆశించిన సమసమాజ నిర్మాణానికి మార్గం సుగమమవుతుంది. రాజ్యాంగ రక్షణే ప్రజాస్వామ్య పరిరక్షణ.