రహదారి భద్రతకు తిరువూరు పోలీసుల ముందస్తు చర్యలు
హైవేపై ట్రాఫిక్ డ్రమ్ములు, స్టాప్ బోర్డులకు రేడియం స్టిక్కర్లు ఏర్పాటు
తిరువూరు: రహదారి ప్రమాదాల నివారణకు, వాహనదారుల భద్రతను పెంపొందించేందుకు తిరువూరు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తిరువూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని హైవేపై ఏర్పాటు చేసిన ట్రాఫిక్ డ్రమ్ములు, స్టాప్ బోర్డులకు రేడియం స్టిక్కర్లు అమర్చారు.
రాత్రి వేళల్లో తక్కువ వెలుతురు ఉన్న ప్రాంతాల్లో కూడా వాహనదారులకు హెచ్చరిక సూచనలు స్పష్టంగా కనిపించేలా ఈ చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. రహదారి భద్రతపై ప్రజల్లో అవగాహన పెంచడంతో పాటు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుళ్లు గద్దల రాంబాబు, సూర్యనారాయణ పాల్గొని రహదారి భద్రతా చర్యలను అమలు చేశారు. పోలీసుల చర్యలను వాహనదారులు, ప్రజలు అభినందించారు.
వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పోలీసులు సూచించారు. రహదారిపై ఏర్పాటు చేసిన స్టాప్ బోర్డులు, హెచ్చరిక సూచనలను గమనిస్తూ నిర్ణీత వేగ పరిమితిలో వాహనాలు నడపాలని కోరారు. ముఖ్యంగా రాత్రివేళల్లో, మలుపుల వద్ద వేగాన్ని తగ్గించాలని సూచించారు.
ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, కారులో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ తప్పనిసరిగా వినియోగించాలని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ ఉపయోగించడం వంటి ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు.
ముందున్న వాహనాలకు తగిన దూరం పాటిస్తూ, రహదారిపై జాగ్రత్తగా ప్రయాణించాలని పోలీసులు సూచించారు. ప్రజల సహకారంతోనే రహదారి ప్రమాదాలను తగ్గించగలమని పేర్కొన్నారు. “మీ భద్రతే మా బాధ్యత.. రహదారి భద్రత ప్రతి ఒక్కరి కర్తవ్యం” అని తిరువూరు పోలీసులు తెలిపారు.