కేయూలో AISF 90వ వార్షికోత్సవ మహాసభల పోస్టర్ ఆవిష్కరణ
హనుమకొండ: కాకతీయ యూనివర్సిటీలో AISF 90వ వార్షికోత్సవ తెలంగాణ రాష్ట్ర మహాసభల పోస్టర్‌ను నాయకులు ఆవిష్కరించారు. సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో హనుమకొండలో నిర్వహించనున్న మహాసభలను విజయవంతం చేయాలని AISF రాష్ట్ర యూనివర్సిటీల ఇన్‌చార్జ్ రెహమాన్ పిలుపునిచ్చారు.
కాకతీయ యూనివర్సిటీ ఫస్ట్ గేట్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో AISF నాయకులు మహాసభల పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రెహమాన్ మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రభుత్వ యూనివర్సిటీల సమస్యల పరిష్కారంపై మహాసభల్లో చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందించనున్నట్లు తెలిపారు.
ప్రభుత్వ యూనివర్సిటీలకు ప్రత్యేక అభివృద్ధి నిధులు కేటాయించాలని, టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టుల్లో ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా MEO, DEO పోస్టుల నియామకాలు చేపట్టాలని కోరారు.
ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయడం, ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లను సకాలంలో విడుదల చేయడం, విద్యాసంస్థల్లో మౌలిక వసతులు మెరుగుపరచడం, పరిశోధనకు మరిన్ని అవకాశాలు కల్పించడం, హాస్టల్ సౌకర్యాలను విస్తరించడం వంటి అంశాలపై ఉద్యమాలు కొనసాగిస్తామని AISF నాయకులు తెలిపారు.
విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం సంఘం ఆధ్వర్యంలో మరింత విస్తృతంగా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. మహాసభలకు విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.