ప్రజావాణిలో 47 వినతుల స్వీకరణ.. వెట్టి చాకిరీ నిర్మూలనకు స్వేచ్ఛా రథం ప్రారంభం
నస్పూర్: ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యమిస్తూ నస్పూర్‌లోని సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మొత్తం 47 వినతులను స్వీకరించారు. జిల్లా అదనపు కలెక్టర్లు పి. చంద్రయ్య, వి. రాములు, జిల్లా రెవెన్యూ అధికారి మోతిరామ్‌తో కలిసి అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించి, సమస్యలను పరిశీలించారు.
ప్రజావాణిలో పలు సమస్యలపై వినతులు అందాయి. ఆర్కా బేకరీ కార్మికుల బకాయి వేతనాలు చెల్లించాలని, కొత్తహరిపేటకు చెందిన భానోత్ దేశాయ్ భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించాలని, మల్లంపేటలో గ్రామపంచాయతీ నిధుల దుర్వినియోగంపై చర్యలు తీసుకోవాలని కొండ్ర సుదర్శన్ ఫిర్యాదు చేశారు. సంపుటం రైతులు నీల్వాయి ప్రాజెక్టు ఎడమ కాలువలో పూడికతీత చేపట్టాలని కోరారు.
ఆతుకూరి సుప్రజ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉపాధి కల్పించాలని వినతిపత్రం సమర్పించారు. పోచమ్మ చెరువు వరద కాలువ ఆక్రమణలను తొలగించాలని అబ్దుల్ సత్తార్ దరఖాస్తు చేశారు. నెన్నెల మండలం కోనంపేటలో పోడు భూములకు సంబంధించిన సమస్యపై సీపీఎం ప్రతినిధి బోడెంకి చందు వినతిపత్రం అందజేశారు. జయ్యారపు దుర్గ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని, లిక్కి శంకరయ్య గిఫ్ట్ డీడ్‌కు సంబంధించిన ఆస్తి వివాదాన్ని పరిష్కరించాలని కోరారు. నస్పూర్ 37వ వార్డు ప్రగతి నగర్‌లో సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువలు నిర్మించాలని జె. కృష్ణారావు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ ప్రజావాణిలో అందిన ప్రతి దరఖాస్తును క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించాలని అధికారులకు సూచించారు. సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ సమస్యలను సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
వెట్టి చాకిరీ నిర్మూలనకు ‘స్వేచ్ఛా రథం’ ప్రారంభం
వెట్టి చాకిరీ, బలవంతపు శ్రమ నిర్మూలనపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రూపొందించిన ‘స్వేచ్ఛా రథం’ ప్రచార వాహనాన్ని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సోమవారం కలెక్టరేట్ భవన సముదాయ ఆవరణలో ప్రారంభించారు. జిల్లా సహాయ కార్మిక శాఖ అధికారి క్రాంతి కుమార్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, జిల్లా సంక్షేమ శాఖ అధికారి రౌఫ్ ఖాన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సమాజంలో వెట్టి చాకిరీ, బలవంతపు శ్రమ వంటి దురాచారాలను నిర్మూలించి, బాధితులకు న్యాయం అందించడమే ఈ ప్రచార కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. కార్మికులకు తమ హక్కులపై అవగాహన కల్పించేందుకు స్వేచ్ఛా రథం ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
బాండెడ్ లేబర్ హెల్ప్‌లైన్ నంబర్ 080-6943434పై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా ఇటుక బట్టీలు, ఆక్వాకల్చర్, భూగర్భ గనులు, క్వారీయింగ్, వ్యవసాయ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు వారి హక్కుల గురించి తెలియజేయాలని సూచించారు. వెట్టి చాకిరీ నిర్మూలనకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.