ఎల్లంబజార్‌లో ఘనంగా 51 అడుగుల మహా గణపతి నిమజ్జనం
తెలంగాణ
/
హన్మకొండ
ఎల్లంబజార్: ఎల్లంబజార్‌లో కొలువుదీరిన 51 అడుగుల భారీ మహా గణపతి విగ్రహ నిమజ్జన కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు. నిమజ్జనాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో పరిసర ప్రాంతాలు సందడిగా మారాయి.
నిమజ్జనం కోసం నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఫైర్ ఇంజిన్ సహాయంతో స్థానికంగానే భారీ గణపతి విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. నిమజ్జనానికి ముందు ప్రత్యేక పూజలు నిర్వహించి గణనాథుడికి భక్తిశ్రద్ధలతో వీడ్కోలు పలికారు.
భక్తుల జయజయధ్వానాలు, గణేశ నామస్మరణల మధ్య నిమజ్జన కార్యక్రమం కొనసాగింది. భారీ విగ్రహాన్ని చూసేందుకు, నిమజ్జనాన్ని వీక్షించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలిరావడంతో ఎల్లంబజార్ పరిసరాలు కిటకిటలాడాయి.
నిమజ్జన కార్యక్రమం సందర్భంగా నిర్వాహకులు అవసరమైన ఏర్పాట్లు చేపట్టడంతో కార్యక్రమం ప్రశాంతంగా ముగిసింది.