వినాయక చవితి వేడుకల్లో 29 రకాల వంటకాలతో విందు భోజనం
ఏలూరు జిల్లా కామవరపుకోట, సెప్టెంబరు 21: వినాయక చవితి సందర్భంగా సాధారణంగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీ. అయితే ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం శివారు కొత్తూరు గ్రామంలోని గంగానమ్మ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయక చవితి మహోత్సవాల్లో అన్నదానాన్ని ప్రత్యేకంగా విందు భోజనంగా ఏర్పాటు చేశారు. ఆలయ కమిటీ 11వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని 29 రకాల వంటకాలతో అరిటాకులో భోజనాలను వడ్డించారు. సాధారణంగా నిర్వహించే బఫే తరహాలో కాకుండా కుర్చీలు, బల్లలు ఏర్పాటు చేసి భక్తులు కూర్చొని భోజనం చేసేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి 4,500 మందికి పైగా హాజరై విందు భోజనాన్ని ఆస్వాదించారు. అరిటాకులో సంప్రదాయ పద్ధతిలో 29 రకాల వంటకాలతో ఏర్పాటు చేసిన భోజనాన్ని భోజన ప్రియులు ఆస్వాదిస్తూ కమిటీ సభ్యుల ఏర్పాట్లను అభినందించారు. భారీ సంఖ్యలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా భోజనాలు ఏర్పాటు చేయడంపై కమిటీ సభ్యులను పలువురు అభినందించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ ‘‘అన్ని దానాల్లోకెల్లా అన్నదానం మిన్న’’ అనే భావనను ఆదర్శంగా తీసుకుని వినాయకుడి పేరుతో ఈ అన్నసమారాధన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అన్నదానం ద్వారా ఆత్మతృప్తి లభిస్తుందని, ప్రతి ఏడాది భక్తులకు మరింత మెరుగైన రీతిలో సేవలు అందించాలనే ఉద్దేశంతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.