ఉర్సు రంగ సముద్రం చెరువులో భారీ కొండచిలువ..
సురక్షితంగా పట్టుకున్న అటవీ అధికారులు
వరంగల్: వరంగల్‌లోని ఉర్సు ప్రాంతం రంగ సముద్రం చెరువు వద్ద మత్స్యకారుల వలకు భారీ కొండచిలువ చిక్కడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. చేపలు పట్టేందుకు వేసిన వలలో పాము చిక్కుకున్న విషయాన్ని గుర్తించిన మత్స్యకారులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని కొండచిలువను సురక్షితంగా పట్టుకున్నారు. సుమారు ఏడు అడుగుల పొడవు, 15 కిలోల బరువు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అనంతరం కొండచిలువను జూ పార్కులో విడిచిపెట్టేందుకు అవసరమైన చర్యలు చేపట్టినట్లు సమాచారం.
కొండచిలువను సురక్షితంగా పట్టుకోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. చెరువులు, నీటి వనరుల సమీపంలో వన్యప్రాణులు కనిపించినప్పుడు వాటిని పట్టుకునేందుకు లేదా దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నించకుండా అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాలని సూచిస్తున్నారు.