మధిర ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సింగ్ కళాశాల ఏర్పాటు చేయాలి
ఎండీఓకు వినతిపత్రం అందజేసిన మధిర స్విమ్మర్స్ అసోసియేషన్
మధిర: ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సింగ్ కళాశాల ఏర్పాటు చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని కోరుతూ మధిర స్విమ్మర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎండీఓకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా స్విమ్మర్స్ అసోసియేషన్ అధ్యక్షులు జంగా నర్సింహారెడ్డి మాట్లాడుతూ మధిర పట్టణంతో పాటు పరిసర గ్రామాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సింగ్ కళాశాల ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిపై ఆధారపడే పేద, మధ్యతరగతి ప్రజలకు స్థానికంగానే మెరుగైన వైద్య సేవలు అందేలా అవసరమైన సౌకర్యాలను కల్పించాలని కోరారు.
నర్సింగ్ కళాశాల ఏర్పాటు చేయడం ద్వారా వైద్య సేవలకు అవసరమైన నర్సింగ్ సిబ్బంది అందుబాటులోకి రావడంతో పాటు అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం స్పందించి మధిర ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సింగ్ కళాశాల ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జంగా నర్సింహారెడ్డి కోరారు.
కార్యక్రమంలో లింగంపల్లి అప్పారావు, పల్లబోతు ప్రసాదు, ఆదూరి అబ్రహం, గండూరి రాంబాబు, శీలం శ్రీనివాస్‌రెడ్డి, కస్తాల సతీష్, కొత్తూరు నరసింహారావు, వట్టే సైదులు తదితర స్విమ్మర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.