పెనుగొలను గ్రంథాలయంలో అడవి బాపిరాజు జయంతి వేడుకలు
గంపలగూడెం: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలోని గ్రంథాలయంలో గురువారం బహుముఖ ప్రజ్ఞాశాలి, ప్రముఖ రచయిత అడవి బాపిరాజు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం నిర్వహించిన సభలో వక్తలు మాట్లాడుతూ అడవి బాపిరాజు తెలుగు సాహిత్యానికి విశేష సేవలందించారని తెలిపారు. ఆయన రచించిన ‘నారాయణరావు’ నవల తెలుగు సాహిత్యంలో తొలి సాంఘిక నవలగా ప్రసిద్ధి చెందిందని పేర్కొన్నారు. ‘హిమబిందు’, ‘గోన గన్నారెడ్డి’ వంటి నవలలతో పాటు ‘బావా బావా పన్నీరు’ వంటి పాటలు తెలుగు పాఠకులు, శ్రోతల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని వివరించారు.
స్వాతంత్ర్య సమరయోధుడిగా, రచయితగా, కళాకారుడిగా, నాటక కర్తగా, న్యాయవాదిగా, చలనచిత్ర దర్శకుడిగా, ఆకాశవాణి కేంద్రంలో సలహాదారుడిగా వివిధ రంగాల్లో బాపిరాజు తన ప్రతిభను చాటుకున్నారని వక్తలు కొనియాడారు. ఆయన సాహిత్య, కళా సేవలను నేటి తరం తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి తెనాలి వెంకటేశ్వర్లు, విశ్రాంత బ్యాంకు మేనేజర్ దేవరపల్లి రమేష్, సాయిబాబా కమిటీ సభ్యులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.