మాదకద్రవ్యాల నియంత్రణపై అవగాహన సదస్సు
మాదకద్రవ్యాల నియంత్రణపై విద్యార్థులకు అవగాహన
ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ వుస్తాల సోమిరెడ్డి
మధిర, సెప్టెంబర్ 21: విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ స్వయం నియంత్రణతో ఉన్నత మార్గంలో పయనిస్తేనే ఉజ్వల భవిష్యత్తు సాధ్యమవుతుందని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ వుస్తాల సోమిరెడ్డి అన్నారు. మధిర మండలం కిష్టాపురం గ్రామంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకులంలో సోమవారం గంజాయి, మాదకద్రవ్యాల నియంత్రణపై అవగాహన సదస్సు నిర్వహించారు. గురుకుల కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టి. రాములు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి సోమిరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.
విద్యార్థులు చదువుపైనే కాకుండా తమకు ఆసక్తి ఉన్న ఇతర విద్యా, సాంస్కృతిక, క్రీడా కార్యక్రమాల్లోనూ పాల్గొని నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. మాదకద్రవ్యాల వినియోగం వ్యక్తి ఆరోగ్యంతో పాటు కుటుంబం, సమాజంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని తెలిపారు. విద్యార్థులు తమ గ్రామాలకు వెళ్లినప్పుడు పరిసరాల్లో ఎవరైనా మత్తు పదార్థాలకు బానిసలుగా మారుతున్నట్లు గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించి వారిని సరైన మార్గంలోకి తీసుకురావడంలో సహకరించాలని కోరారు.
తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు, తోటి విద్యార్థులకు మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించాలని సూచించారు. మత్తు పదార్థాల ప్రభావంతో వ్యక్తి తనపై తాను నియంత్రణ కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని, తద్వారా వ్యక్తిగత జీవితంతో పాటు సామాజిక సంబంధాలు కూడా దెబ్బతింటాయని వివరించారు. ఆరోగ్యకరమైన, బాధ్యతాయుతమైన సమాజ నిర్మాణంలో విద్యార్థుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు.
చదువుతో పాటు పరిసరాల పరిశుభ్రత, సామాజిక బాధ్యత, క్రమశిక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఇతరుల ప్రభావానికి లోనుకాకుండా స్వయం నియంత్రణ, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి ఉత్తమ పౌరులుగా ఎదగాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. అవసరమైన ప్రతి సందర్భంలో ఉపాధ్యాయుల సలహాలు, సహకారం తీసుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా మధిర ఎక్సైజ్ సీఐ బాలకిషన్ మాట్లాడుతూ మత్తు పదార్థాలు మనిషిని క్రమంగా బానిసగా మార్చి ఆరోగ్యం, విద్య, వ్యక్తిగత జీవితం, భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతాయని తెలిపారు. విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండటంతో పాటు వాటి నియంత్రణపై ఇతరులకు కూడా అవగాహన కల్పించాలని కోరారు.
కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ ఐనాల సైదులు, మధిర ఎక్సైజ్ సీఐ బాలకిషన్, జేవీపీ సంజీవరావు, సీనియర్ అధ్యాపకులు కొక్కిరేణి సత్యం, నాగేశ్వరరావు, రామయ్య, ఉపాధ్యాయులు సామ్సన్, రేణుక, రాధిక, శరత్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ మౌలాలి తదితరులు పాల్గొన్నారు.