చాట్రాయి మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించాలి చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు త్వరితగతిన పూర్తి చేయాలి: డి. హరినాథ్
ఏలూరు జిల్లా చాట్రాయి మండలం చీపురుగూడెం గ్రామంలో అఖిల భారత కిసాన్ మహాసభ నాయకుడు కునాల్ జోషి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి కిసాన్ మహాసభ రాష్ట్ర కార్యదర్శి డి. హరినాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చాట్రాయి మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించి, రైతులను ఆదుకునేందుకు తక్షణమే కరువు నివారణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మెట్ట ప్రాంత రైతులకు ఎంతో ప్రయోజనం చేకూర్చే చింతలపూడి ఎత్తిపోతల పథకం రెండో దశ పనులను సత్వరమే పూర్తి చేసి సాగునీటి సమస్యకు పరిష్కారం చూపాలని కోరారు. మంగపేటలో నివాసముంటున్న వారికి పొజిషన్ సర్టిఫికెట్లు మంజూరు చేయాలని, అటవీ భూములను సాగు చేసుకుంటున్న పేదలకు చట్టబద్ధంగా భూమిపై హక్కులు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ కార్మికులకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఏడాదికి 200 రోజుల పని కల్పించడంతోపాటు రోజువారీ వేతనాన్ని రూ.700కు పెంచాలని డిమాండ్ చేశారు. అలాగే ఎస్‌ఐఆర్ (ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ) ప్రక్రియను రద్దు చేయాలని, ఈ ప్రక్రియకు సంబంధించి కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌పై చర్యలు తీసుకోవాలని హరినాథ్ కోరారు. సమావేశంలో శ్యామల జోషి మాట్లాడుతూ గ్రామంలో మానసిక వైకల్యంతో బాధపడుతున్న వారిని సర్వే ద్వారా గుర్తించి, వారి వివరాలను సంబంధిత ప్రభుత్వ అధికారులకు అందజేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాధితులకు మానసిక ధైర్యం కల్పించడంతోపాటు అర్హత ఆధారంగా ప్రభుత్వ పింఛన్లు, వైద్య సదుపాయాలు అందేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో బీరాంబాబు, మాజీ ఎంపీటీసీ మేకల చందు, కౌన్సిలర్ ఎన్. అశోక్, రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎం. జెస్సీ తదితరులు పాల్గొన్నారు.