ఢిల్లీ బాటలో చంద్రబాబు.. పోలవరం అంశాలపై కేంద్రంతో కీలక చర్చలు
అమరావతి/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం ఉదయం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అనంతరం ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీ పర్యటనలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో పాటు కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్, పలువురు కేంద్ర మంత్రులతో ఆయన సమావేశం కానున్నట్లు సమాచారం.
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన పలు కీలక అంశాలను చంద్రబాబు కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పోలవరం–నల్లమలసాగర్ అనుసంధాన పథకానికి అనుమతులు ఇవ్వడంతో పాటు పోలవరం ప్రాజెక్టు రెండో దశకు అవసరమైన నిధుల మంజూరుపై కేంద్రంతో చర్చించనున్నట్లు సమాచారం.
పోలవరం స్పిల్‌వేపై ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణానికి అవసరమైన నిధుల అంశాన్ని కూడా కేంద్రం వద్ద ప్రస్తావించే అవకాశం ఉంది. పోలవరం–నల్లమలసాగర్ లింక్‌కు సంబంధించి గతంలోనూ కేంద్రం వద్ద అనుమతులు, ఆర్థిక సహాయం కోరినట్లు అధికారిక సమాచారం వెల్లడిస్తోంది.
మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్ఠానం, ఏఐసీసీ నేతలతో సమావేశం కానున్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) అంశంపై ఇండియా కూటమి చేపట్టిన నిరసనల నేపథ్యంలో కాంగ్రెస్ తదుపరి కార్యాచరణపై చర్చ జరిగే అవకాశం ఉంది.
మంగళవారం ఢిల్లీలో SIRకు వ్యతిరేకంగా ఇండియా కూటమి నేతలు చేపట్టిన నిరసన తీవ్రరూపం దాల్చింది. ఎన్నికల సంఘం కార్యాలయం వైపు మార్చ్ నిర్వహించిన అనంతరం పలువురు ప్రతిపక్ష నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ పరిణామాలపై రేవంత్ రెడ్డి ఇప్పటికే స్పందించారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు ఇతర ప్రతిపక్ష నేతల అదుపులోకి తీసుకోవడాన్ని ఆయన ఖండించారు. SIR, ఓటర్ల హక్కులకు సంబంధించిన అంశాలపై కాంగ్రెస్ పోరాటాన్ని కొనసాగిస్తుందని పేర్కొన్నారు.