టీజీపీఎస్సీ సిలబస్‌పై స్పష్టత.. అభ్యర్థులకు ఊరట
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగ నియామక పోటీ పరీక్షల సిలబస్‌లో మార్పులు చేయనున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారంపై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్పష్టత ఇచ్చింది. సిలబస్‌ను మార్చేందుకు ప్రస్తుతం ఎలాంటి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయలేదని కమిషన్ వెల్లడించింది.
సిలబస్ మార్పులపై వస్తున్న ప్రచారాలతో గ్రూప్స్‌తో పాటు ఇతర పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల నుంచి వచ్చిన సందేహాలు, వినతులను పరిగణనలోకి తీసుకున్న కమిషన్ అధికారికంగా తన వైఖరిని వెల్లడించింది.
సిలబస్ కమిటీ ఏర్పాటు కాలేదు
పోటీ పరీక్షల సిలబస్‌ను పునర్వ్యవస్థీకరించేందుకు ఎలాంటి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయలేదని టీజీపీఎస్సీ స్పష్టం చేసింది. సామాజిక మాధ్యమాల్లో సిలబస్ మార్పులపై జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని సూచించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న సిలబస్ ప్రకారమే అభ్యర్థులు తమ పరీక్షల సన్నద్ధతను కొనసాగించాలని తెలిపింది.
భారీ మార్పులుంటే ఏడాది ముందే సమాచారం
పోటీ పరీక్షల సిలబస్‌లో భవిష్యత్తులో పెద్దఎత్తున మార్పులు చేయాల్సి వస్తే.. అభ్యర్థులు కొత్త విధానానికి సిద్ధం కావడానికి వీలుగా కనీసం ఏడాది ముందుగానే అధికారికంగా సమాచారం అందిస్తామని టీజీపీఎస్సీ కార్యదర్శి వెల్లడించారు.
అదే సమయంలో స్వల్ప స్థాయిలో మార్పులు చేయాల్సిన అవసరం ఏర్పడితే.. సంబంధిత ఉద్యోగ నియామక నోటిఫికేషన్‌లోనే సిలబస్‌కు సంబంధించిన వివరాలను స్పష్టంగా పొందుపరుస్తామని తెలిపారు. దీంతో ప్రస్తుతానికి సిలబస్ మార్పులపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అభ్యర్థులు తమ ప్రిపరేషన్‌ను యథావిధిగా కొనసాగించవచ్చని కమిషన్ స్పష్టం చేసింది.